జర్నలిజం పాఠాలు చెప్పే పెద్దలు, సీనియర్లు.. దానికి సంబంధించిన చట్టాలు వ్యవస్థల గురించి వివరించేప్పుడు.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి కూడా తప్పకుండా చెప్పి తీరాల్సిందే.
అయితే పుస్తకాల్లో లేని, ఒక వ్యాఖ్యను కూడా ఈ పీసీఐ గురించి.. వారు మరచిపోకుండా చెబుతుంటారు. ప్రెస్ కౌన్సిల్ అనేది కోరల్లేని సింహం అని.. దానిని చూసి సాధారణంగా ఎవ్వరూ భయపడరని పలువురు సీనియర్లు అంటుంటారు.
అలాంటి కోరల్లేని సింహం పీసీఐ – ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి మీడియాలో తప్పుడు వార్తలకు సంబంధించి తెచ్చిన కొత్త జీవో మీద రంకెలు వేస్తుండడమే గమనార్హం.
సింపుల్ లాజిక్ తో ఆలోచిద్దాం…
మీడియాలో తప్పుడు కథనాలు వస్తే వ్యక్తులు గానీ, సంస్థలు/ వ్యవస్థలు గానీ… పీసీఐకు ఫిర్యాదు చేయవచ్చు. వారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. (వారికి ఎలాంటి చట్టబద్ధమైన శిక్షలు విధించగల అధికారాలు ఉన్నాయనేది వేరే సంగతి- ఇక్కడ ప్రస్తావనార్హం కాదు) మంచిదే బాగుంది. మీడియా ముసుగులో ఎవరంతట వాళ్లు చెలరేగిపోతుంటే.. కాస్త కట్టడి చేయడానికి పీసీఐ పనిచేస్తుంది.
-ఇంత వరకు అంతా బాగానే ఉంది కదా…! మరి ఏపీ ప్రభుత్వం కొత్తగా చేసిన చేటు ఏముంది. 2430 జీవో ద్వారా ప్రభుత్వం ఏం చెబుతోంది? తప్పుడు వార్తలు రాసిన వాళ్ల మీద ప్రభుత్వ సెక్రటరీ స్థాయి అధికారులు కేసులు పెట్టవచ్చు అనే కదా చెబుతోంది. అంతే తప్ప.. ప్రచురితమైన వార్తలు తప్పుడువని భావిస్తే.. వారి మీద కఠిన చర్యలు తీసుకునే అధికారాలను, కట్టబెట్టడం లేదు కదా…!
స్థూలంగా చేసినప్పుడు పీసీఐ తమ దృష్టికి వచ్చే కేసులను విచారించి శిక్షలు వేస్తుంది. ఈ ఏపీ జీవో ద్వారా కార్యదర్శులు కేసులు పెట్టగలరు. కాకపోతే వారు కేవలం పీసీఐ సముఖంలో మాత్రమే కాకుండా… కోర్టుల్లో కూడా కేసులు పెట్టవచ్చు. కేసులు పెట్టడం తప్ప ఈ జీవో వారికి కట్టబెడుతున్న అధికారం మరేమియునూ లేదు!
మరి ఇలాంటి జీవో గురించి ఎందుకు అంతగా విలవిల్లాడిపోతున్నారో అర్థం కావడం లేదు. ఈ జీవో ద్వారా పీసీఐకు పనిభారం తగ్గుతుంది. కొన్ని కేసులు.. ఇతర కోర్టులకు వెళ్తాయి. అందుకు పీసీఐ విలపించడం ఎందుకు? అర్థంలేదని ప్రజలు భావిస్తున్నారు.