ఉత్తరాంధ్రా ఇపుడు ఏపీ రాజకీయాలలో కీలకంగా మారుతోంది. ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు అయిదు ఎంపీ సీట్లు కలిగిన ఉత్తరాంధ్రాలో రాజకీయం అనుకూలంగా చేసుకోవడం కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్రాలో కీలక నేతగా చక్రం తిప్పిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ చాలా కాలం తరువాత ఉత్తరాంధ్రా నినాదంతో జనం ముందుకు వచ్చారు.
ఆయన ఉత్తరాంధ్రా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో వివిధ రాజకీయ పర్టీలకు చెందిన నాయకులను ఆహ్వానించి మాట్లాడించారు. ఉత్తరాంధ్రాను ప్రగతిపధంలో చూడాల్సిందే అంటున్నారు కొణతాల. ఉత్తరాంధ్రా సాగు తాగు నీటి ప్రాజెక్టులతో పాటు అనేక రకాలైన వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
గత నాలుగేళ్ళుగా సైలెంట్ గా ఉన్న కొణతాల ఇపుడు ఉత్తరాంధ్రా అభివృద్ధి అంటూ జనంలోకి రావడంతో ఆయన ఆలోచనల మీద అజెండా ఏమిటన్న దాని మీద కూడా పలు రకాలైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొణతాల మరోమారు తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని అంటున్నారు.
ఇప్పటిదాకా ఏ పార్టీకి సంబంధం లేదని చెబుతూ వస్తున్న కొణతాల రాజకీయ రూట్ ఏంటన్నది తేలాల్సి ఉంది. ఆయన ఉత్తరాంధ్రా పేరిట సంధిస్తున్న ప్రశ్నలు లేవనెత్తుతున్న అంశాలు, అన్ని పార్టీలతో పెడుతున్న సమావేశాల పర్యవశానం ఏంటి అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది అంటున్నారు.