రాజకీయాలు అంటే నిరంతర ప్రక్రియ. అక్కడ ఓడినా గెలిచినా డైనమిక్ గా ఉండాలి. అంతా నిత్యం జనంలో ఉండాలి. అలా ఉండని నాయకులను తెర మరుగు అయ్యారని అంటారు. అయితే వారిని కోల్డ్ స్టోరేజ్ నేతలు అంటారని మంత్రి గుడివాడ అమరనాధ్ కొత్త డెఫినిషన్ చెప్పారు.
జనాలకు దూరంగా రాజకీయాలకు కాకుండా ఏళ్ళకు ఏళ్ళు కనబడని నేతలంతా ఒక్క చోట చేరడం విశేషమే. వారిని పట్టుకుని కోల్డ్ స్టోరేజ్ నేతలు అని గుడివాడ భలే సెటైర్ వేశారు. ఉత్తరాంధ్రా అభివృద్ధి అంటూ ఒక సదస్సు విశాఖలో పెడితే అటెండ్ అయిన వారు అంతా ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కనిపించిన వారు కానే కాదు అని వైసీపీ నేతలు అంటున్నారు.
అలాగే ఆ ప్రాంతానికి సంబంధం లేని వారు అంతా వచ్చి ఉత్తరాంధ్రా ప్రగతి అంటూ తెలిసీ తెలియని మాటలు మాట్లాడారని అంటున్నారు. దీని మీద గుడివాడ మండిపడుతూ ఉత్తరాంధ్రా అభివృద్ధి అన్నారు మరి విశాఖను రాజధానిగా ఎందుకు స్వాగతించలేకపోతున్నారు అని కీలక ప్రశ్ననే వేశారు. విశాఖ రాజధాని అయితే ఆటోమేటిక్ గా ఉత్తరాంధ్రా అభివృద్ధి చెందుతుంది కదా అయినా ఒక్కరంటే ఒక్కరు విశాఖ క్యాపిటల్ ఊసెత్తితే ఒట్టు అని ఆయన ఫైర్ అయ్యారు.
తమ ప్రభుత్వ హయాంలో విశాఖ సహా ఉత్తరాంధ్రా అభివృద్ధి కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించి అనేక చర్యలను తీసుకుంటున్నామని అయినా సరే ఇవేమీ పట్టని నాయకులు కొందరు అక్కడ చేరి కేవలం వైసీపీ ప్రభుత్వం మీదనే విమర్శలు చేయాలని చేశారని ఆయన మండిపడ్డారు.
ఇలాంటి సదస్సులు పెట్టడం వెనక అసలు ఉద్దేశ్యం చంద్రబాబుని మరోసారి సీఎం చేయడమే అని అసలు గుట్టు విప్పారు. ఉత్తరాంధ్రాలో ఉనికి కోసం పెట్టే ఈ సదస్సుల వల్ల సొంత రాజకీయం తప్ప జనాలకు ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. జగన్ నాయకత్వంలో విశాఖ రాజధాని అవుతుందని, ఉత్తరాంధ్రా అభివృద్ధి కూడా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి గారి కామెంట్స్ ఎలా ఉన్నా కోల్డ్ స్టోరేజ్ నేతలు అంటూ సెటైర్లు వేయడం మాత్రం గట్టిగానే తగులుతోంది.