ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాపై జనసేన నాయకుడు, మెగాబ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల మెగాబ్రదర్స్‌పై రోజా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు కౌంటర్‌గా సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. రోజా అంటూ ఆయన మొదలు పెట్టి హితవు చెప్పారు. పనిలో పనిగా రోజాపై దారుణ వ్యాఖ్యలు చేశారు. రోజాపై నాగబాబు కామెంట్స్ జనసేన శ్రేణుల్ని సంబరాల్లో ముంచుతున్నాయి.
ఆ వీడియోలో నాగబాబు ఏమన్నారంటే…భారతదేశంలో ఏపీ పర్యాటకశాఖ 18వ స్థానంలో ఉన్నట్టు నాగబాబు తెలిపారు. నువ్వు ఇలాగే పిచ్చపిచ్చగా మాట్లాడితే 20వ స్థానంలో వుంటుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మంది జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల జీవితాలు మట్టి కొట్టుకుపోయాయని నాగబాబు వాపోయారు. ముందు పర్యాటకశాఖ మంత్రిగా నీ బాధ్యతల గురించి తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.
పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదన్నారు. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో పాటు తన గురించి మాట్లాడావన్నారు. తాను లెక్క చేయనన్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లపై ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణం ఉందన్నారు. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదని ఘాటు వ్యాఖ్య చేయడం గమనార్హం. చూస్తా చూస్తా ఎవరూ మున్సిపాలిటీ కుప్పతొట్టిని కదపరన్నారు.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటకశాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని నాగబాబు హితవు చెప్పారు. రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టితో పోల్చడంపై మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.