ఆస్ట్రేలియా నుంచి వాడు వీడియో కాల్స్ చేస్తే… కాబోయే భర్తే కదా అని నమ్మింది. అతడు కోరినట్టుగా చేసింది. అయితే పెళ్లికి ముందే వాడి రాక్షసత్వం బయటపడింది. మోసపోయిన ఆ యువతి నిస్సహాయురాలిగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
ప్రేమ, పెళ్లికి ముందు బంధాల్లో అవతలి వారిని ఎంత వరకూ నమ్మాలి? అనే ప్రశ్నను రేకెత్తించే వార్త ఇది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన రామ్ కార్తీక్ అనే నరకాసురుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసిన నేరం చేసిన.. కాబోయే భర్త అని తను నమ్మిన యువతి జీవితాన్ని నాశనం చేసి, ఆమె మరణానికి కూడా కారణం కావడం.
ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడని ప్రగతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు సమ్మతించారు. పెద్దలు కుదిర్చిన వివాహం కావడం, ఆ అమ్మాయి అతడిని పూర్తిగా నమ్మింది. కాబోయే వాడేగా అనుకుంది. విదేశంలో ఉండటంతో.. వాట్సాప్ చాటింగ్ లలో సరససల్లాపాలే సాగిస్తున్నట్టుగా భ్రమపడింది. తీరా వాడి రాక్షసత్వం ఇండియా వచ్చాకా బయటపడింది.
తను కోరినంత కట్నం ఇవ్వాలంటూ మొదలుపెట్టాడు. తను ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నట్టు కాబట్టి తనకు ఎక్కువ కట్నం ఇస్తామంటూ వేరే సంబంధాలు కూడా వస్తున్నాయంటూ ప్రగతితో బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. ఎక్కవ కట్నం ఇవ్వాలనే డిమాండ్ మాత్రమే చేయలేదు, అలా ఇస్తేనే పెళ్లి అని కూడా ఆగలేదు. తను కోరినట్టుగా చేయకపోతే వాట్సాప్ చాట్ లో తను రికార్డు చేసిన నగ్న దృశ్యాలను బయటపెడతానంటూ కూడా ఆ యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు.
పెద్దలకు తెలిసింది కట్నకానుకల విషయం వరకే. దీంతో వాడి సంబంధం తమకు అక్కర్లేదని ఆమె తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. గత నెల 21 న జరగాల్సిన నిశ్చితార్థం కట్నకానుకల వద్ద తేడా వచ్చి ఆగిపోయింది. దీంతో ఆ యువతికి ఆత్మహత్యే శరణ్యంగా భావించినట్టుగా ఉంది. తన వీడియోలను బయటపెడతానంటూ అతడు బెదిరించిన తీరుకు ఆమె భయపడింది. తను అన్ని రకాలుగానూ మోసపోయినట్టుగా భావించింది. అక్టోబర్ 17 వతేదీ కట్నకానుకల గురించి పెద్దలు చర్చించారు, కుదరదు అనుకున్నారు. 18వ తేదీ రాత్రి ఆ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె ఫోన్ నూ, కార్తీక్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారించగా.. మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. వాడితో పెళ్లి కుదరలేదు అని ఆ అమ్మాయి తనువు చాలించలేదు. వాడు చేసిన బ్లాక్ మెయిలింగ్ ఫలితంగా ఆమె ప్రాణాలను తీసుకుంది. కాబోయే వాడని నమ్మి తనతో అలా ప్రవర్తించిందనే జాలి కూడా వాడికి లేకపోయింది.
పెళ్లి వద్దనుకున్న వాడు అంతటితో అయినా ఆగకుండా, ఆ నిర్భాగ్యురాలి జీవితాన్ని కడతేర్చాడు. ప్రేమ పేరుతో అమ్మాయిల గొంతు కోసే ప్రేమోన్మాదులకూ, పెళ్లి పేరుతో నమ్మించి ఆమె మృతికికారణం అయిన వాడికి ఏమైనా తేడా ఉంటుందా? ఇలాంటి నరకాసురాల వధకు మరెన్ని దీపావళులు రావాలో!