మరోసారి స్థానిక సంస్థల ఉప పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధం కావాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనడం ఇష్టం లేకపోయినా… ప్రతిపక్ష పార్టీలకు తప్పడం లేదు. పోటీ చేయకుండా అవమానపాలు కావడం కంటే ఓటమే గౌరవ ప్రదం అని ఏపీ ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హయాంలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది.
కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేయడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. నిమ్మగడ్డ పదవీ విరమణ అనంతరం నీలం సాహ్నీకి ఆ పదవి దక్కింది. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటితో పాటు 7 కార్పొరేషన్‌లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు, ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.
పనిలో పనిగా పరిషత్ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. దీంతో మంచి ముహూర్తాలు చూసుకుని అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.
మరోవైపు ఈ ఉపపోరులో అధికార పార్టీ వైసీపీని కట్టడి చేయడానికి ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పొత్తుల విషయమై చర్చించుకుంటున్నాయి. బీజేపీ, జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఇంకా కొలిక్కి రాలేదు. నెల్లూరు కార్పొరేషన్‌లో జనసేన, బీజేపీ చెప్పుకోతగ్గ స్థాయిలో బలంగా ఉన్నాయి. ఇక్కడ పొత్తు విషయమై ఇవాళ సాయంత్రానికి స్పష్టత రావచ్చని చెబుతున్నారు.
ఇక మిగిలిన చోట్ల బీజేపీ, జనసేన మధ్య పొత్తుపై క్లారిటీ రాలేదు. బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయామనే భావనలో జనసేన నేతలు ఉన్నారు. దీంతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని మరోసారి నష్టపోవడమా లేక భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కొనసాగాలా లేదా అనేది జనసేన ఎటూ తేల్చుకోలేకున్నది. మరోవైపు నామినేషన్ల దాఖలుకు కేవం ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది.
సమయం లేకపోవడం, మరోవైపు స్పష్టత కరవు కావడంతో బీజేపీ, జనసేన నాయకులు సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. ఎవరికి వారు నామినేషన్లు వేస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నట్టు సమాచారం. వైసీపీ మాత్రం అన్ని చోట్ల ఒంటరిగానే బరిలో దిగుతోంది.