పాపం.. చంద్రబాబు కష్టం పగవాడికి కూడా వద్దు..!

చాన్నాళ్ల కిందట ఓ మొబైల్ నెట్ వర్క్ యాడ్ వచ్చేది. యజమాని ఎక్కడికెళ్తే అతడి వెనకే ఓ కుక్కపిల్ల తిరిగేది. నువ్వు ఎక్కడికెళ్లినా మా నెట్ వర్క్ ఫాలో అవుతుందంటూ దానికి క్యాప్షన్ తగిలించారు.…

చాన్నాళ్ల కిందట ఓ మొబైల్ నెట్ వర్క్ యాడ్ వచ్చేది. యజమాని ఎక్కడికెళ్తే అతడి వెనకే ఓ కుక్కపిల్ల తిరిగేది. నువ్వు ఎక్కడికెళ్లినా మా నెట్ వర్క్ ఫాలో అవుతుందంటూ దానికి క్యాప్షన్ తగిలించారు. సరిగ్గా చంద్రబాబుకు ఇప్పుడది సూట్ అవుతుంది. 

గత ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచి ఈ క్షణం వరకు బీజేపీ అనుగ్రహం కోసం తపిస్తూనే ఉన్నారు బాబు. వాళ్లు ఎన్నిసార్లు ఛీ కొట్టినా బాబు తన ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. తాజాగా మరోసారి చంద్రబాబుకు బీజేపీ నుంచి చీత్కారం ఎదురైంది. దీంతో ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

దియోధర్ ఏమన్నారు..?

టీడీపీ ఓ కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, దానికి దశ, దిశ లేదు. బద్వేల్ లో టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్ కి వేయాలని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి తాళం పడినట్టే, త్వరలో ఏపీలో కూడా తాళం పడుతుందంటూ తీవ్రంగా విమర్శించారు సునీల్ దియోధర్. టీడీపీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

బహుశా బాబు తమ మాటల్ని పట్టించుకోరు అని భావించారేమో…. ఏపీ బీజేపీకి హైకమాండ్ ప్రతినిధిగా తానీ మాటలు చెబుతున్నానంటూ బాంబు పేల్చారు దియోధర్. దీంతో నేరుగా ఆ బాంబ్ వచ్చి బాబు గుండెల్లో పేలింది. దెబ్బకు కుదేలైపోయారు చంద్రబాబు.

హైకమాండ్ కి ఇష్టం ఉన్నా మాకు లేదు..

ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనని కూడా సునీల్ దియోధర్ కామెడీ చేశారు. ఢిల్లీలో చంద్రబాబును కలవలేకపోయిన అమిత్ షా, బాగా ఫీలై తిరిగి బాబుకు ఫోన్ చేసి మాట్లాడారంటూ టీడీపీ ప్రచారం చేసుకోవడంపై కూడా సెటైర్లు వేశారు. 

ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్లడం హైకమాండ్ కి ఇష్టం ఉన్నప్పటికీ, తాము మాత్రం టీడీపీని, చంద్రబాబుని లెక్కలోకి తీసుకోబోమంటూ పదే పదే చెబుతున్నారు ఏపీ బీజేపీ నేతలు. పదే పదే ఇలా బీజేపీ నేతలు చీత్కరిస్తున్నా కూడా బాబు వారి ప్రాపకం కోసం పాకులాడ్డం మాత్రం విచిత్రంగా తోస్తుంది.

బాబుకి గత్యంతరం లేదా..?

సొంతగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం అంటే అది పార్టీని పూర్తిగా పడుకోబెట్టడమేననే విషయం చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే ఏదో పార్టీకి తోకలా మారడానికి, తాను కొన్ని తోకలు తగిలించుకోడానికి ఆయన ఎప్పుడో సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వద్దంటున్నా బీజేపీ వెంట పడుతున్నారు. 

ఓవైపు ఛీ పొమ్మంటున్నా, మరోవైపు ఇలా వెంటపడుతూ, సాగిలపడుతున్నారు. బహుశా రాజకీయాల్లో ఇంతకంటే పెద్ద కష్టం మరోటి ఉండదేమో.