కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం టీడీపీ అధినేత చంద్రబాబును వెంటాడుతోంది.
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఎలాగైనా పరువు కాపాడుకోవాలని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కుప్పంలోనే చంద్రబాబును మట్టి కరిపించి, ఇక ఆ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయనే సందేశాన్ని, సంకేతాల్ని ప్రజానీకంలోకి తీసుకెళ్లాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు వేయడంలో మొదటి రోజే అధికార పార్టీ దూకుడు ప్రదర్శించింది. మొదటి రోజు మొత్తం 18 నామినేషన్లు దాఖలు కాగా… అందులో వైసీపీ మద్దతుదారులు 16, టీడీపీ 1, బీజేపీ 1 చొప్పున ఉండడం గమనార్హం. వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ 16వ వార్డు నుంచి నామినేషన్ వేశారు.
నామినేషన్ల దాఖలుకు సంబంధించి పత్రాల్లో ఎలాంటి తప్పులు లేకుండా ఒకటికి నాలుగు సార్లు టీడీపీ పరిశీలన చేసుకుంటోంది. నామినేషన్ల పత్రాల్లో చిన్న పొరపాటు దొర్లినా తిరస్కరించడానికి వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించుకుంటుందనే భయం టీడీపీలో ఉంది.
కుప్పం మున్సిపల్ ఎన్నికల బాధ్యుడిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని చంద్రబాబు నియమించారు. కుప్పం మున్సిపాలిటీని నాలుగు క్లస్టర్లుగా విభజించి, నలుగురు రాష్ట్ర నాయకులను కూడా టీడీపీ రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కుప్పంలో మకాం వేశారు. అయితే అధికార పార్టీ వ్యూహం ముందు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎంత వరకూ నిలబడుతుందో ఎన్నికల ఫలితాలే చెప్పాల్సి వుంది.
మొత్తానికి కుప్పం మున్సిపాలిటీ విజయం టీడీపీకి చావుబతుకుల సమస్య అయ్యింది. ద్యేవుడా ఈ సారికి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కించు సామి అని టీడీపీ నేతలు వేడుకుంటున్నారు.