తొంబై కోట్ల రూపాయల బకాయిలు. అతి పెద్ద మొత్తం విశాఖలో పెండింగులో ఉంది. దాన్ని వసూల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ని పక్కన పెట్టి మరీ చేసిన దూకుడుకు ఫలితం జరీమానాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా వాటి మీద చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో అది పెద్ద మొత్తం అయి కూర్చుంది. దాంతో తొంబై కోట్లకు పైగా జరీమానాగా పడిన మొత్తాన్ని వసూల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఇపుడు కదులుతున్నారు.
రెడ్ సిగ్నల్స్ ని క్రాస్ చేసిన కేసులు, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం, లైన్ క్రాసింగ్, ఓవర్ స్పీడ్, నో పార్కింగ్ వంటి కేసులలో ట్రాఫిక్ చలానాలు ఇక మీదట కట్టిస్తారు. ఇంతకు ముందు కట్టని వారి నుంచి ముక్కు పిండి వసూల్ చేస్తారు. వారూ వీరూ అన్నది చూడకుండా జరీమానా కట్టించుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ని నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
విశాఖలో ఇపుడు వాహనదారులు రోడ్ల మీదకు రావాలంటే ఒకటికి పదిసార్లు ట్రాఫిక్ రూల్స్ బుక్ ని చదువుకోవాల్సి ఉంటుంది. గతంలో ట్రాఫిక్ చలానాలు చెల్లించని వారు అయితే బుద్ధిగా కట్టేయాల్సి ఉంటుంది. కాదూ కూడదు అంటే చట్టపరమైన చర్యలకు సైతం వెనకాడబోమని ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పష్టం చేయడంతో బీ కేర్ ఫుల్ అన్నదే అందరూ చెప్పే మాట.
పెండింగ్ జరీమానా మొత్తాలు వసూళ్ళ విషయంలో భారీ టార్గెట్లు కూడా పెట్టి ట్రాఫిక్ పోలీసులను రోడ్ల మీదకు వదులుతూండడంతో ఆదాయానికి ఆదాయం వస్తుంది. వాహనదారులలో సైతం క్రమశిక్షణ పెరుగుతుంది అని అంటున్నారు.