ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సోషల్ మీడియాను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలిసింది. టీడీపీ సోషల్ మీడియా నూతన సారథిగా జీవీ రెడ్డి నియమితులైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఇతను ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. జీవీరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని చూస్తే… టీడీపీ రెడ్ల సామాజిక వర్గాన్ని మరింత దగ్గరికి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో టీడీపీ మొదటి నుంచి బలంగా వుంది. అయితే ప్రత్యర్థులు కూడా బలంగా వున్న నేపథ్యంలో కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు టీడీపీ సన్నద్ధమైంది,. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ టీడీపీ సోషల్ మీడియా ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో పార్టీలోని యువ మేధావులు. నిబద్ధత ఉన్న నాయకులకు స్థానం కల్పించే క్రమంలో జీవీరెడ్డికి సముచిత స్థానాన్ని చంద్రబాబు, లోకేశ్ కల్పించినట్టు తెలుస్తోంది.
జీవీరెడ్డి తాజాగా సోషల్ మీడియా మాధ్యతలు స్వీకరించినట్టు సమాచారం. న్యాయ విద్యతో పాటు సీఏ చదివిన జీవీరెడ్డికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, న్యాయపరమైన అంశాలపై లోతైన అవగాహన వుంది. ఏ విషయాన్నైనా సులువుగా విశ్లేషించగలిగే సామర్థ్యం జీవీరెడ్డికి ఉందనే గుర్తింపు పొందారు. అందుకే ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు చంద్రబాబు, లోకేశ్ కీలక బాధ్యతలు అప్పగించారని తెలిసింది. చింతకాయల విజయ్‌తో కలిసి ఇక మీదట సోషల్ మీడియా వేదికగా వైసీపీపై ఎన్నికల సమరాన్ని జీవీ నేతృత్వంలో కొనసాగించనున్నారు.
ఇదిలా వుండగా వైసీపీ సోషల్ మీడియా సారథిగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా పాలక ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా వార్ ఇద్దరు రెడ్ల నేతృత్వంలో సాగనుందన్న మాట.