రెవెన్యూలో చెల్లుబాటుకాని స‌ర్కార్ ఆదేశాలు

ప్ర‌జానీకానికి రెవెన్యూశాఖ ఓ శ‌నిలా ప‌ట్టుకుంది. పాల‌కులు, ఉన్న‌తాధికారుల ఆదేశాల‌ను ఏ మాత్రం ఖాత‌రు చేయ‌ని ప‌రిస్థితి ఏపీ రెవెన్యూశాఖ‌లో వుంది. ఏ పార్టీ పాలిస్తున్నా, రెవెన్యూశాఖ మెడ‌లు వంచి ప్ర‌జ‌ల కోసం ప‌ని…

ప్ర‌జానీకానికి రెవెన్యూశాఖ ఓ శ‌నిలా ప‌ట్టుకుంది. పాల‌కులు, ఉన్న‌తాధికారుల ఆదేశాల‌ను ఏ మాత్రం ఖాత‌రు చేయ‌ని ప‌రిస్థితి ఏపీ రెవెన్యూశాఖ‌లో వుంది. ఏ పార్టీ పాలిస్తున్నా, రెవెన్యూశాఖ మెడ‌లు వంచి ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయించ‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు. స‌మావేశాల్లో మంత్రులు, ఉన్న‌తాధికారులు రెవెన్యూ అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్టు, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లొస్తుంటాయి. అవి చూసి …అబ్బా ప్ర‌భుత్వం హెచ్చ‌రించింద‌ని, అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఎవ‌రైనా భావిస్తే, అది వారి త‌ప్పే త‌ప్ప రెవెన్యూశాఖ‌ది కాద‌ని గుర్తించుకోవాలి.

తాజాగా ఇవాళ్టి ప‌త్రిక‌లో మ్యుటేష‌న్ల‌పై మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, రాష్ట్ర భూప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీసీఎల్ఏ) సాయిప్ర‌సాద్ కీల‌క ఆదేశాల గురించి వ‌చ్చింది. ఎవ‌రైనా భూమి కొనుగోలు చేసి, అది త‌మ పేరుపై ఆన్‌లైన్‌లో మార్చుకోవ‌డాన్నే మ్యుటేష‌న్ అంటారు. ఆన్‌లైన్‌లో కొనుగోలుదారుల పేర్లు ఎంట‌ర్ అయితే ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు వ‌స్తాయి. సొంత డ‌బ్బుతో భూములు కొనుగోలు ఒక ఎత్తైతే, వాటిని త‌మ పేరుపై మార్చుకోవ‌డం (మ్యుటేష‌న్‌) పెద్ద తంతు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ్యుటేష‌న్ చేసే ప్ర‌క్రియ‌లో రెవెన్యూ అధికారులు కొనుగోలుదారుల‌కు చుక్క‌లు చూపుతున్నారు. రెవెన్యూ అధికారులు అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తుండ‌డంతో, ఈ బాధ ప‌డ‌లేక ఎందుకు కొన్నాంరా బాబూ అని వాపోవ‌డం వారి వంతైంది. విజ‌య‌వాడ‌లో ప‌లు జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో నిర్వ‌హించిన‌ స‌మావేశంలో మంత్రి ధ‌ర్మాన కీల‌క ఆదేశాలు ఏంటంటే…

“రిజిస్ట్రేష‌న్ అనంత‌రం కొనుగోలుదారు నుంచి ద‌ర‌ఖాస్తు వ‌చ్చిన వెంట‌నే మ్యుటేష‌న్ చేయండి. వ్య‌క్తిగ‌తంగా క్ర‌య‌, విక్ర‌య‌దారుల మ‌ధ్య ఉన్న స‌మస్య‌ల‌ను మ్యుటేష‌న్ చేయ‌డానికి ముడిపెట్టొద్దు. అన‌వ‌స‌ర కొర్రీల‌తో కాల‌యాప‌న చేయొద్దు” అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆదేశాలిచ్చారు. స‌క్ర‌మంగా జ‌రుగుతుంటే ఆయ‌న ఎందుకు అలా అంటారు. అడుగ‌డుగునా కొర్రీలు వేస్తున్నార‌నే ఫిర్యాదులు రావ‌డం వ‌ల్లే మారాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇదే స‌మావేశంలో రాష్ట్ర భూప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీసీఎల్ఏ) సాయిప్ర‌సాద్ సీరియ‌స్ కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశమ‌య్యాయి. ఆయ‌న ఏమ‌న్నారో తెలుసుకుందాం.

“మ్యుటేష‌న్లు ఆప‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే అనేక ద‌ఫాలు చెప్పాం. నిబంధ‌న‌ల ప్ర‌కారం భూముల రిజిస్ట్రేష‌న్ జ‌రిగిన త‌ర్వాత మ్యుటేష‌న్ చేయ‌క‌పోవ‌డం తీవ్ర‌మైన అంశం. రైతుల నుంచి వ‌చ్చే భూముల మ్యుటేష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించాల్సిందే. మ్యుటేష‌న్ల‌లో స‌వ‌ర‌ణ‌లు కోరుతూ వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 31,956 వుంటే, వీటిలో 4,500 తిర‌స్క‌రించారు. మ‌రో 5,600 ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. కోర్టులు ఆదేశించే పరిస్థితి తెచ్చుకోవ‌ద్దు” అని ఆయ‌న ఘాటు హెచ్చ‌రిక చేశారు. రిజిస్ట్రేష‌న్ అయిన‌ప్ప‌టికీ ఆర్ఎస్ఆర్‌లో ఇనామ్ వ‌ద్ద‌ని కొర్రీలు వేస్తున్న అధికారులు బోలెడు మంది ఉన్నారు.

రెవెన్యూశాఖ అధికారుల‌కు క‌నీస నియ‌మ నిబంధ‌న‌లు తెలియ‌క‌పోవ‌డం, డ‌బ్బుకు క‌క్కుర్తి ప‌డుతూ రైతుల్ని, ఇత‌ర రంగాల ప్ర‌జ‌ల్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్నార‌నేది వాస్త‌వం. పాల‌కులు, ఉన్న‌తాధికారులు ఇలా ఆదేశాలు ఇవ్వ‌డం ప‌రిపాటే అని రెవెన్యూ అధికారుల భావ‌న. అందుకే వారికి ఎన్ని హెచ్చ‌రిక‌లు, హిత‌బోధ‌లు చేసినా, దున్న‌పోతుపై వాన ప‌డిన చంద‌మే. ఆదేశాలు ఇవ్వ‌డం ముఖ్యం కాదు, అవి అమ‌లుకు నోచుకున్న‌ప్పుడే ప్ర‌యోజ‌నం.