Advertisement

Advertisement


Home > Politics - Analysis

పోటీ ఇవ్వ‌గ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో.. టీడీపీ పాట్లు!

పోటీ ఇవ్వ‌గ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో.. టీడీపీ పాట్లు!

వ‌చ్చేది ఎన్నిక‌ల సంవ‌త్స‌రం. గ‌ట్టిగా చూస్తే ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది స‌మ‌యం ఉంది. 2024 ఈ స‌మ‌యానికి ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుతుంది. ఇలాంటి నేఫ‌థ్యంలో పార్టీలు అభ్య‌ర్థులు, అభ్యర్థిత్వాల విష‌యంలో క‌స‌ర‌త్తును దాదాపు మొద‌లుపెట్టిన‌ట్టే. ఎక్క‌డ ఎవ‌రో పార్టీ అధిష్టానాలు దాదాపు తేల్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్నం అవుతూ ఉంది. త‌మ‌కు అనుకూల‌మై నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా పార్టీలు తాడోపేడో తేల్చుకోవాలి ఇక‌. పోటీ ఇవ్వ‌గ‌ల చోట ఇప్ప‌టినుంచి గ‌ట్టిగా ప్లాన్ చేసుకుంటేనే ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌వ‌చ్చు!.

గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు పూర్తి వ‌న్ సైడెడ్ గా వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌త్యేకించి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ ముక్క ఎక్క‌డుందో ఏరుకుని చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. విశేషం ఏమిటంటే.. నాలుగేళ్లు గ‌డిచిపోతున్నా తెలుగుదేశం పార్టీలో ఇంకా స్ఫూర్తి ఏదీ రాలేదు. క‌సి పుట్టించే క‌స‌ర‌త్తులు ఏవీ జ‌ర‌గ‌డం లేదు. చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నం వ‌స్తున్నారు, ఎగ‌బ‌డుతున్నారు అని చెప్పుకోవ‌డం మీద టీడీపీ పెడుతున్న శ్ర‌ద్ధ నియోజ‌క‌వ‌ర్గాల మీద మాత్రం క‌నిపిస్తున్న‌ట్టుగా లేదు. గోబెల్స్ ప్ర‌చారం చేసుకుని ఊపు ఉంద‌ని నిరూపించుకోవ‌డానికి టీడీపీ పాట్లు ప‌డుతూ ఉంది. 

ఇప్పుడు చేయాల్సిన ప‌ని క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకోవ‌డం త‌ప్ప మీడియా హైప్ కాదు!మీడియా హైప్ తో నెగ్గేసే రోజులు పోయాయ‌ని టీడీపీ కి ఇంకా అర్థం కావ‌డం లేదు. ఎక్క‌డెక్క‌డి ఫొటోల‌నుతెచ్చుకుని త‌మ‌విగా చెప్పుకుంటూ ఆద‌ర‌ణ పెరిగింద‌ని టీడీపీ ప్ర‌యాస ప‌డుతోంది. అయితే అంతో ఇంతో అనుకూల‌మై నియోజ‌క‌వ‌ర్గాలు, పోటీ ఇవ్వ‌గ‌లిగిన చోట కూడా టీడీపీ ఇంకా అస‌లు క‌స‌ర‌త్తు మొద‌లుపెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల జాబితాను ప‌రిశీలిస్తే పూర్వ అనంత‌పురం జిల్లాలో మూడు సీట్లను ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌చ్చు. 

టీడీపీ క‌నీస పోటీ ఇవ్వ‌గ‌ల సీట్లు ఇవి. అయితే అంత‌ర్గ‌త క‌ల‌హాలు, బాధ్యులు ఎవ‌రో ప‌చ్చ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే క్లారిటీ లేక‌పోవ‌డంతో వెర‌సి పార్టీ ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే , వ‌స్తుందంటే ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌చ్చితంగా గెల‌వాలి. వీటిల్లో గెల‌వ‌లేక‌పోతే మాత్రం టీడీపీ అధికారం గురించి మ‌రిచిపోవ‌చ్చు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌త్య‌సాయి జిల్లాలోని పుట్ట‌ప‌ర్తి, ధ‌ర్మ‌వ‌రం, పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గాలు ముందుంటాయి. చ‌రిత్ర‌ను చూస్తే టీడీపీ అధికారంలో ఉందంటే ప్ర‌తిసారీ ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉంటారు. టీడీపీ రాష్ట్రంలో ఓడిపోయిన సంద‌ర్భాల్లో కూడా ఈ సీట్లలో నెగ్గేది గ‌తంలో. అయితే క్రితం సారి వీటిల్లో టీడీపీ చిత్త‌య్యింది. ఇప్ప‌టికీ ప‌రిస్థితి అయితే మెరుగ‌ప‌డ‌క‌పోగా..అంత‌ర్గ‌త క‌ల‌హాలు, నాయ‌కుడు ఎవ్వ‌రో తేల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ముందుగా పుట్ట‌ప‌ర్తి పరిస్థితిని ప‌రిశీలిస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డి ఓట‌మిపాల‌య్యారు. సీనియ‌ర్ పొలిటీషియ‌న్, ఆర్థిక శ‌క్తిలో తిరుగులేదు. అయితే పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత ఆయ‌న ప్ర‌జ‌ల్లో తిరిగింది మాత్రం లేదు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు చూసుకుందాంలే అన్న‌ట్టుగా ఉంది ప‌ల్లె తీరు. టికెట్ ద‌క్కితే గెలిస్తే గెలుస్తాం లేదంటే లేద‌న్న‌ట్టు అంత తాపీగా ఉంటుంది ప‌ల్లె వ్య‌వ‌హారం. సిరిసంప‌ద‌ల‌కు కొద‌వ‌లేదు. ఇలాంట‌ప్పుడు ఓ తెగ తిరిగేసి క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ప‌ల్లెకు లేక‌పోవ‌చ్చు. ఆఖ‌ర్లో పార్టీ ఫండ్, ఎన్నిక‌ల‌కు ఫండ్ కు ఇబ్బంది లేదు. అలా ప‌ల్లె ఒక ట్ర‌య‌ల్ వేయ‌వ‌చ్చు. ప‌ల్లెకు గెలిచినా, ఓడినా కొత్త‌గా పోయేదేమీ లేదు. 

అయితే పార్టీలో మాత్రం పోటీదారులు త‌యార‌య్యారు. జేసీ సోద‌రులు ఇక్క‌డ ఒకరిని త‌యారు చేశారు. ఆయ‌న‌కే టికెట్ అని ప్ర‌చారం చేసుకుంటూ ఉన్నారు. అలాగే బీసీల జ‌నాభా గ‌ట్టిగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఇది. ఇలాంటి నేప‌థ్యంలో ఈ ప్రాంతంలో గ‌తంలో ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించిన గోరంట్ల మాజీ ఎమ్మెల్యే, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప త‌న త‌న‌యుల్లో ఒక‌రికైనా పుట్ట‌ప‌ర్తి టికెట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబును కోరుతున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. బీసీల‌కు ప్రాతినిధ్యం పెరిగింద‌ని చంద్ర‌బాబు నిరూపించుకోవాలంటే పుట్ట‌ప‌ర్తి టికెట్ ను బీసీల‌కు క‌చ్చితంగా ఇవ్వాల్సి ఉంది. ఏతావాతా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంది. ఎన్నిక‌ల నాటికి ఏం స‌ర్ద‌గ‌ల‌ర‌నేది అనుమాన‌మే!

ఇక టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట పెనుకొండ‌. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిన‌ప్పుడు కూడా పెనుకొండ‌లో టీడీపీ నెగ్గింది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి ఆ కంచుకోట‌ల ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. మ‌రి ఆ త‌ర్వాత టీడీపీ తీరు ఏమైనా మారిందా అంటే అలాంటిదేమీ లేదు. ఇక్క‌డ పార్థ‌సార‌థి పురాత‌న నేత అయిపోయారు. సొంత సామాజిక‌వ‌ర్గం కూడా ఆయ‌న వైపు మొగ్గు చూప‌డం లేదు. కుర‌బ‌లు భారీ ఎత్తున ఉన్నారు. శంక‌ర్ నారాయ‌ణ‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఇటు తిప్పుకుంది. ఇక పార్థ‌సార‌ధికి పోటీగా మ‌హిళా కురుబ నేత ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే నిమ్మ‌ల కిష్ట‌ప్ప చూపు ఈ నియోజ‌క‌వ‌ర్గం మీద కూడా ఉంది. పుట్ట‌ప‌ర్తి టికెట్ కేటాయించ‌న‌ట్టు అయితే పెనుకొండ‌ను అయినా త‌న త‌న‌యుల్లో ఒక‌రికి ఇవ్వాల‌నేది నిమ్మ‌ల ప్ర‌య‌త్నంగా తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సాలె జ‌నాభా కూడా చెప్పుకోద‌గిన‌ట్టుగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో నిమ్మ‌ల ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతాయో చూడాల్సి ఉంది.

ఇక ఏపీలో టీడీపీ అధికారం సంపాదించుకోవాలంటే గెల‌వాల్సిన సీట్ల‌లో ఇంకోటి ధ‌ర్మ‌వ‌రం. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. టీడీపీ ఇక్క‌డ నాయ‌క‌త్వ సంక్షోభం ఉంది. ఎమ్మెల్యే ప‌ద‌వి పోగానే ఇక్క‌డ నుంచి వ‌ర‌దాపురం సూరి బీజేపీలోకి వెళ్లారు. ఆయ‌న ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం ఉంది. ఆయ‌న‌కే టికెట్ ద‌క్కుతుంద‌ని కూడా టాక్. అయితే ప‌రిటాల కుటుంబం కూడా ఇక్క‌డ మ‌కాం పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రి ఈ రెండు వ‌ర్గాల్లో ఎవ‌రికి టికెట్ ద‌క్కుతుంద‌నేది ఇంకా క్లారిటీ లేని అంశ‌మే. ఎవ‌రికి టికెట్ ద‌క్కినా మ‌రొక‌రు వారి ఓట‌మికి కృషి చేయ‌డం మాత్రం నిస్సందేహం!

టీడీపీకి అధికారం ద‌క్కాల‌న్నా, ద‌క్కుతుంద‌న్నా.. ఇలాంటి సీట్ల‌లో ఊపు ఉండాలి. గెలుపు ద‌క్కాలి. అయితే ఇలాంటి చోట్లే టీడీపీకి క్లారిటీ లేక‌పోవ‌డ‌మే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గెలుస్తంద‌ని ఎవ‌రైనా వాదించినా, అందులో త‌ర్కం క‌నిపించ‌దు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?