ఆస్కార్ అవార్డంటే అదేదో చంద్రమండలంలో ఉండే వస్తువన్నట్టుగా మనవాళ్లు అసలు దానిని పొందాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండేవాళ్లు కాదు.
కానీ ఎప్పుడైతే మనవాళ్లకి “జస్ట్ ఏవరేజ్” అనిపించిన ఆర్.ఆర్.ఆర్ కే ఏదో ఒక విభాగంలో ఆస్కారొచ్చిందో ఇక ఎవ్వరూ తగ్గట్లేదు.
కాస్త సినిమా బాక్సాఫీసు దగ్గర ఆడితే చాలు, ఆస్కారు కల్లోకొచ్చేస్తోంది కొందరికి. తాజాగా గదర్-2 దర్శకుడు అనీల్ శర్మ తనది ఆస్కార్ అవార్డుకి పూర్తి అర్హత ఉన్న సినిమా అని చెప్తున్నాడు. ఆస్కార్ బరిలో నిలబెడతానంటున్నాడు.
ఆస్కార్ అనేది సినిమా ఆడింది కదా అని ఇచ్చేది కాదు, కమిటీ మెచ్చితే ఇచ్చేది! కమిటీ మెప్పు పొందే పనులు రాజమౌళి చేయగలినప్పుడు తామెందుకు చెయ్యలేమని ధీమా కావొచ్చు అనీల్ శర్మకి.
ఆమాటకొస్తే ఆర్.ఆర్.ఆర్ తో పాటూ చాలా సినిమాలు ఇండియా నుంచి బరిలో నిలబడే ప్రయత్నాలు చేసాయి. అయితే ఎవరూ కూడా ఇలా అనీల్ శర్మ టైపులో బహిరంగంగా ప్రకటించలేదు. సైలెంటుగా ప్రయత్నించారంతే.
ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాని ఆస్కార్ దాకా మోసుకెళ్లడం వల్ల గదర్-2 దర్శకుడికి కూడా కోరిక పుట్టింది. అదే కనుక బాహుబలిని మోసుకెళ్లినా ఇలా ప్రకటించి ఉండేవాడు కాదు. ఎప్పుడైతే “జస్ట్ ఏవరేజ్” కంటెంట్ తో బెస్ట్ ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ఫలితముంటుందని అర్ధమయ్యిందో “గదర్-2” లాంటి జస్ట్ ఏవరేజ్ మెటీరియల్ పై కూడా నమ్మకం పెట్టేసుకుంటున్నాడు దర్శకుడు.
ఆర్.ఆర్.ఆర్ సినిమా తీసినదానికంటే ఆస్కార్ బరిలో నిలబెట్టి ప్రచారం చేయడానికి రాజమౌళి రాసుకున్న స్క్రిప్ట్ గొప్పది. ఎప్పుడు ఎవరికి షో వేసి, ఎక్కడ ఎవరితో ట్వీట్లు చేయించి, ఏ రోజు ఎవరితో ఇంటర్వ్యూ చేయించాలో నిర్ణయించి, ఏ పేపర్లో ఏ కొలతలో ఆర్టికల్స్ రాయించాలో లెక్కలేసి, అమెరికాలోనే నెలల తరబడి మకాం వేసి..ఇవన్నీ చేయడానికి కోట్లు కుమ్మరిస్తే ఒక పాటకి వచ్చింది అవార్డు.
ఒకరకంగా ఇస్రో వాళ్లు మొదటి సారిగా చంద్రుడి దక్షిణధృవానికి దారి చూపినట్టు, రాజమౌళి భారతీయ సినీ మేకర్లకి ఆస్కార్ దారి చూపాడు. అదే ఫార్ములాని వాడి, భీభత్సమైన పీఆర్ యాక్టివిటీ చేసి తమ సినిమాల్ని ఆస్కార్ బరిలో నిలబెట్టుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందాలని దర్శకులకే కాదు హీరోలకి కూడా పుట్టేసింది.
పుష్ప-1 కి వచ్చిన నేషనల్ అవార్డుతో అల్లు అర్జున్ సరిపెట్టుకోడు. పుష్ప-2 తో ఆస్కార్ బరిపైన దృష్టి ఉంటుంది తనకి. సుకుమార్ కూడా ఆ దిశగా అడుగులు వేయడం తధ్యం. దానికి నిర్మాత కనీసం ఒక వంద పక్కనపెట్టాల్సి రావొచ్చు.
ప్రస్తుతం మహేశ్ బాబు కూడా రాజమౌళి తీస్తున్న సినిమాలో నటించబోతూ ఆస్కార్ కలలు కంటూ ఉండొచ్చు.
ఒక రకంగా ఆస్కార్ లోకువైపోయిందనుకున్నా భారతీయులుగా, తెలుగువాళ్లుగా మరోపక్క గర్వపడాల్సిన సందర్భం కూడా! తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. స్పీల్బెర్గ్, కేమరూన్ లాంటి వాళ్లు మన సినిమాని పొగడడం, మన హీరోల పేర్లని ఉచ్చరించడం ఇవన్నీ పెద్ద విషయాలే.
అయితే మన ఆడియన్స్ కూడా సరైన సినిమాని ఆస్కారుకి పంపుతున్నారు, ఫలానా సినిమా ఆస్కార్ స్థాయిలో ఉంది అని కంటెంట్ ని చూసినప్పుడే అనుకోవాలి. అలా కాకుండా “గదర్-2” ని కూడా ఆస్కార్ స్థాయి అంటుంటే నవ్వొస్తుంది. ఏమో, కంటెంట్ తో సంబంధం లేకుండా ప్రచారాన్ని పట్టించుకుని ఏదో ఒక కేటగిరీలో అవార్డిస్తే ఇవ్వొచ్చు..అది వేరే సంగతి.
పైన చెప్పినట్టు, “బాహుబలి” చిత్రాన్ని ఆస్కార్ కి పంపి ఉండుంటే యావద్దేశం గొప్పగా భావించేది. దానికి ఆ స్థాయి ఉందని అధికశాతం మంది ఒప్పుకునే రేంజ్ చిత్రమది. అవార్డొచ్చినా రాకపోయినా అది వేరే సంగతి. కానీ ఎప్పుడైతే ఆర్.ఆర్.ఆర్, గదర్-2 ఆస్కార్ కోసం పోటీ అన్నాయో ఆస్కార్ విలువ మన ఆడియన్స్ దృష్టిలో సన్నగిల్లింది.
– శ్రీనివాసమూర్తి