పళ్లున్న చెట్టు దగ్గరకు చేరాలని చూస్తారు ఎవరైనా. అందులోనూ టాలీవుడ్ లో మరీనూ. ఏ నిర్మాత కూడా నేరుగా అన్ని పనులు చక్కబెట్టలేరు. ఎవరో ఒకరిని సిఇఓ గానో, భాగస్వామి గానో, మరో విధంగానో దగ్గరకు తీసుకోవాల్సిందే. ఇలా తీసుకునేవారు బంధువులో, సన్నిహతులో అయి వుంటారు ఎక్కువగా. అలా కాకుండా వుండి, అక్కడ చెట్టునిండి పళ్లు కనిపిస్తూ వుంటే పైగా ఓనరు దూరంగా వున్నాడనిపిస్తే ఇక అటు కన్నేసే వాళ్లు సంఖ్యకు కొదవేమీ వుండదు. అప్పటి వరకు వున్న వారిని ఎలా బదనామ్ చేయాలి. ఎలా దూరం చేయాలి. ఎలా ఆ ప్లేస్ లోకి చేరాలి అనే ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి.
ఇండస్ట్రీలోని ప్రామిసింగ్ బ్యానర్ పీపుల్స్ మీడియా వ్యవహారం ఇలాగే వుంది. దీనికి అధినేత విశ్వప్రసాద్. ఒకప్పుడు మేనేజింగ్ పోస్ట్ మాత్రమే కావచ్చు. ఇప్పుడు మాత్రం నిర్మాణ భాగస్వామి వివేక్ కూచిభొట్ల. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ ఎడా పెడా అడ్వాన్స్ లు ఇస్తూ వుండడం, ఎవరితో పడితే వాళ్లతో ప్రాజెక్టులు సెట్ చేస్తూ వుండడం, భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వుండడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది కన్ను అటు పడింది.
మెల్లగా ఎలాగైనా వివేక్ ప్లేస్ లోకి చేరాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. అలా చేరాలంటే వివేక్ ను అక్కడి నుంచి దూరం చేయాలి. అందుకే బ్రో సినిమా తరువాత నుంచి వివేక్ కు విశ్వప్రసాద్ కు మధ్య దూరం పెరుగుతోందనే గ్యాసిప్ లు మొదలు పెట్టారు. హీరో నిఖిల్ పార్టీకి వివేక్ రాకపోవడంతో అదే నిజం అని నమ్మబలికే ప్రయత్నం చేసారు. నిజానికి ఆ రోజు వివేక్ దుబాయ్ లో గోల్డెన్ వీసా ఇంటర్వూకు వెళ్లాల్సి వచ్చింది.
వివేక్-విశ్వప్రసాద్ ల బంధం కేవలం పీపుల్స్ మీడియాకు పరిమితం కాదు. ఇంకా చాలా వ్యాపారాలు వున్నాయి. అన్నీ సినిమాకు అనుబంధమైనవే. స్టూడియో, ఎక్విప్ మెంట్, ఇంకా చాలా. అంతే కాదు. విశ్వప్రసాద్ కు సంబంధించిన వేరే వ్యాపారాల వ్యవహారాలను కూడా వివేక్ నే చక్కబెడతారు. అందువల్ల వారిద్దరి బంధం అంత సులువుగా తెగిపోయేది కాదు.
కానీ వివేక్ ను తప్పిస్తే తాము అక్కడ చేరిపోవచ్చని.. ఇక దున్నేయవచ్చని ముగ్గురు నలుగురు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వివేక్-విశ్వప్రసాద్ మీద వదంతులు బాగానే వదులుతున్నారు.
నిజానికి వీళ్లందరికీ తెలియంది ఏమిటంటే, విశ్వప్రసాద్ ఇక్కడ వున్నా, అమెరికాలో వున్నా, ఆయనకు తెలియకుండా పీపుల్స్ మీడియాలో ఏదీ జరగదన్నది.