Advertisement

Advertisement


Home > Politics - Gossip

పారిశ్రామిక‌వేత్త పార్టీలోకి అఖిల‌ప్రియ‌!

పారిశ్రామిక‌వేత్త పార్టీలోకి అఖిల‌ప్రియ‌!

ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లు కావ‌డంతో టికెట్ల హ‌డావుడి మొద‌లైంది. ఏపీలో అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అధికారం కోసం నువ్వానేనా అని గ‌ట్టిగా ఢీకొన‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఇరుపార్టీల అధినేత‌లు తీవ్రంగా క‌స‌రత్తు చేస్తున్నారు. అధికారం ద‌క్కించుకోడానికి ప్ర‌తి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో టికెట్ ద‌క్క‌ద‌ని భావించే నాయ‌కులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఆలోచిస్తున్నారు.

ఈ ప‌రంప‌ర‌లో నంద్యాల జిల్లాలో టీడీపీ కీల‌క నాయ‌కురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అడుగులు టీడీపీకి షాక్ ఇచ్చేలా వున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం ఆమె ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జ్‌. ఆళ్ల‌గ‌డ్డ‌తో పాటు నంద్యాల‌లో ఆమె రాజ‌కీయం చేస్తున్నారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో త‌న‌కు, నంద్యాల‌లో త‌న సోద‌రుడు భూమా జ‌గ‌త్ విఖ్యాత్‌రెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని అధిష్టానాన్ని కోరుతున్నారు.

నంద్యాల‌లో ఇప్ప‌టికే అఖిల‌ప్రియ పెద‌నాన్న కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఇన్‌చార్జ్‌గా ఉంటూ, పార్టీని బ‌లోపేతం చేసుకుంటున్నారు. నంద్యాల‌లో అన్న‌కు వ్య‌తిరేకంగా అఖిల‌ప్రియ మ‌రో గ్రూప్ ఏర్పాటు చేయ‌డంపై టీడీపీ అధిష్టానం సీరియ‌స్‌గా వుంది. మ‌రోవైపు ఆళ్ల‌గ‌డ్డ టికెట్ కూడా అఖిల‌కు ఖ‌రారు చేయ‌లేదు.

నాలుగు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇన్‌చార్జ్‌ల‌తో చంద్ర‌బాబు స‌మావేశం నిర్వ‌హించారు. ఆ స‌మావేశానికి అఖిల‌ప్రియ‌ను ఆహ్వానించ‌లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే అఖిల‌ప్రియ అటు వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. త‌న‌ను అడుగ‌డుగునా నిర్ల‌క్ష్యం చేస్తున్న చంద్ర‌బాబుకు త‌న స‌త్తా ఏంటో చూపాల‌నే ప‌ట్టుద‌ల‌తో అఖిల‌ప్రియ ఉన్నారు. అఖిల‌ప్రియ అస‌లే మొండి మ‌నిషి.

ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో 30 వేల ఓట్లు యాద‌వులు, ఇంచుమించు అంతే సంఖ్య‌లో బ‌లిజ‌ల ఓట్లు ఉండ‌డంతో అఖిల‌ప్రియ ఆలోచ‌న‌లు మారిపోతున్నాయి. త‌న భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌ది బ‌లిజ సామాజిక వ‌ర్గం కావ‌డంతో, వారంతా వ్య‌క్తిగ‌తంగా త‌మ‌కు అండ‌గా ఉండాల‌ని ఆమె ఆలోచిస్తున్నారు. అలాగే యాద‌వుల ఓట్ల‌ను రాబ‌ట్టుకోడానికి అఖిల‌ప్రియ మ‌రో అస్త్రాన్ని ప్ర‌యోగిస్తున్నారు. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన రామ‌చంద్ర యాద‌వ్ కొత్త‌గా భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ (బీసీవైసీపీ) ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

రామ‌చంద్ర‌యాద‌వ్‌తో అఖిల‌ప్రియ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ప‌ట్టించుకోక పోవ‌డం, మ‌రోవైపు రామ‌చంద్ర‌యాద‌వ్ సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతుండ‌డంతో అఖిల‌ప్రియ త‌న‌ను గౌర‌వించే పార్టీలో రాజ‌కీయాలు చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఆమె అనుచ‌రులు చెబుతున్నారు.  

తాను చెప్పిన వారికి 10 చోట్ల అసెంబ్లీ టికెట్లు ఇవ్వాల‌ని రామ‌చంద్ర యాద‌వ్ ఎదుట అఖిల‌ప్రియ ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టు స‌మాచారం. అలాగే ఆళ్ల‌గ‌డ్డ‌లో ఎన్నిక‌ల ఖ‌ర్చు క‌నీసం రూ.30 కోట్లు ఇచ్చేలా డీల్ కుదిరిన‌ట్టు విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్థికంగా కూడా అఖిల‌ప్రియ ఇటీవ‌ల కాలంలో దెబ్బ‌తిన్న సంగ‌తి తెలిసిందే. దీంతో వెతుకుతున్న తీగ కాలికి త‌గిలిన‌ట్టు ఎన్నిక‌ల స‌మ‌యంలో రామ‌చంద్ర యాద‌వ్ దొరికాడ‌ని అఖిల‌ప్రియ అనుచ‌రులు అంటున్నారు. తాను చెప్పిన వారికి 10 టికెట్లు ఇస్తే, క‌నీసం ఇద్ద‌రు ముగ్గురిని గెలిపించుకొస్తాన‌ని అఖిల‌ప్రియ భ‌రోసా ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఇవ‌న్నీ చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉన్నాయి. టీడీపీలో మాత్రం త‌న‌కు భ‌విష్య‌త్ లేద‌న్న న‌మ్మ‌కంతోనే అఖిల‌ప్రియ ఆలోచ‌న‌లు అనేక విధాలుగా సాగుతున్నాయి. ఇదిలా వుండ‌గా అఖిల‌ప్రియ రాజ‌కీయ అడుగుల్ని టీడీపీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తోంది. స్థానిక నేత‌లు, స‌ర్వే టీమ్స్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు అఖిల‌ప్రియ క‌ద‌లిక‌ల‌పై స‌మాచారాన్ని టీడీపీ పెద్ద‌లు తెప్పించుకుంటున్నార‌ని తెలిసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?