ఇదే పని తెలంగాణలో చేసే దమ్ముందా పవన్!

ఇసుక కొరత అంటూ విశాఖలో 'లాంగ్ మార్చ్' చేపట్టిన పవన్ కల్యాణ్ తెలంగాణలో అదే తరహాలో ఏదైనా కార్యక్రమం నిర్వహించగలరా? జనసేనానికి అంత దమ్ము, ధైర్యం ఉందా? ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో హాట్ హాట్…

ఇసుక కొరత అంటూ విశాఖలో 'లాంగ్ మార్చ్' చేపట్టిన పవన్ కల్యాణ్ తెలంగాణలో అదే తరహాలో ఏదైనా కార్యక్రమం నిర్వహించగలరా? జనసేనానికి అంత దమ్ము, ధైర్యం ఉందా? ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఇది.

ఇసుక కొరత కంటే అతిపెద్ద సమస్య తెలంగాణలో నడుస్తోంది. అదే ఆర్టీసీ కార్మికుల సమ్మె. లక్షలాది మంది ప్రజల్ని ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై ప్రత్యక్షంగా స్పందించే ధైర్యం పవన్ కు ఉందా అంటున్నారు తెలంగాణ జనసైనికులు. ఇసుక సమస్యపై ఏపీలో బహిరంగంగా స్పందించినట్టు.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తెలంగాణలో కూడా ఓ బహిరంగ కార్యక్రమం పెట్టాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు.

సమస్య చిన్నదైనా, పెద్దదైనా.. చివరికి అది సమస్య కాకపోయినా ప్రెస్ నోట్ తో కాలక్షేపం చేయడం పవన్ స్టయిల్. దేనికైనా ఆయన పద్ధతి ఇదే. సింపుల్ గా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారు. ఆర్టీసీ సమ్మెపై కూడా పవన్ ఇలానే వ్యవహరించారు. ప్రభుత్వం పెద్దల్ని కలవడానికి ప్రయత్నించినప్పటికీ అపాయింట్ మెంట్ దొరకలేదని ఫీలర్లు వదిలారు. ఇక్కడే పవన్ నిబద్ధత ఏంటో అర్థమౌతోంది.

ఇసుక కొరత విషయంలో మాత్రం ఆయన ఎవ్వర్నీ కలిసే ప్రయత్నం చేయలేదు. టీడీపీ మద్దతుతో నేరుగా వెళ్లి విశాఖలో సభ పెట్టుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో  మాత్రం ఆ పని చేయడానికి సాహసించడం లేదు పవన్.

తెలంగాణలో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లా ఉండదు. విశాఖలో పవన్ కార్యక్రమం చేపడితే, స్వయంగా దానికి ఏపీ సర్కార్ క్లియరెన్స్ ఇచ్చింది. పోలీస్ బందోబస్త్ ఏర్పాటుచేసింది. అదే తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేస్తానంటే పవన్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు కేసీఆర్.

అసలు పవన్ ఇంత దూరం కూడా వెళ్లాల్సిన పనిలేదు, ఆర్టీసీ సమస్యపై తెలంగాణ గడ్డపై ఓ ప్రెస్ మీట్ పెడితే చాలంటున్నారు జనసైనికులు. కానీ పవన్ కు ఆ ధైర్యం కూడా చాలడం లేదు.

తెలంగాణలో ఏపీ తరహా పరిస్థితులు లేవు. విశాఖ కార్యక్రమానికి పవన్ కు బీజేపీ మద్దతు ఇవ్వలేదు. టీడీపీ అచ్చెన్నాయుడ్ని పంపి అరకొరగా మద్దతు కేటాయించింది. అదే తెలంగాణలో పవన్ సభ పెట్టాలనుకుంటే.. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు గంపగుత్తగా మద్దతిస్తాయి. అయినా పవన్ కు ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే అక్కడున్నది కేసీఆర్.

నోటికొచ్చినట్టు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి, పోనీలే అని వదిలేయడానికి అక్కడున్నది అతిమంచి జగన్ కాదు, కరడుకట్టిన కేసీఆర్.