ఒకసారి ఊళ్ల దత్తత..మరోసారి గుడ్ గవర్నెన్స్..ఇంకోసారి పర్యావరణం ఇలా కాస్త సోషల్ మెసేజ్ వున్న సబ్జెక్ట్ లను టచ్ చేస్తూ, దాని చుట్టూ కమర్షియల్ టచ్ వున్న కథ అల్లుకోవడం అన్నది దర్శకుడు కొరటాల శివ స్టయిల్.
అయితే ప్రతిసారీ యంగ్ హీరోను తీసుకుంటూ, మాంచి లవ్ స్టోరీ అటాచ్ చేస్తూ వస్తున్న ఆయన ఈసారి మాత్రం చిరు లాంటి సీనియర్ హీరోను తీసుకున్నారు. మిడిల్డ్ ఏజ్డ్ మాజీ నక్సల్ గా చిరు ను చూపించబోతున్నారని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.
ఈ మిడిల్ ఏజ్డ్ మాజీ నక్సల్ పోరాడే సమస్య ఏమిటంటే దేవాలయ భూముల దురాక్రమణ అంట. దేవాలయ భూములు ఆక్రమించేయడం, అమ్మేసుకోవడం, దేవాలయాలు ఆదాయం లేక జీర్ణ స్థితికి చేరుకోవడం, దేవుడికే నైవేద్యం కరువైన స్థితి తెలుగునాట అందరికీ తెలిసిందే.
అయితే విశాఖలో సింహాచలం దేవస్థానానికి చాలా భూములువున్నాయి. ఎప్పుడో పూసపాటి వంశీకులు ఇచ్చిన వేలాది ఎకరాలు ఎక్కెక్కడో విస్తరించి వుండడంతో, దశాబ్దాల కాలంగా అన్యాక్రాంతం అవుతూనే వస్తున్నాయి.
సామాన్యులు, మాన్యులు కూడా ఆక్రమించేసారు. ఈ అందరికీ తెలిసిన పాయింట్ నే తీసుకుని కొరటాల శివ తన తాజా సినిమాకు స్క్రిప్ట్ తయారు చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా కోసం చిన్న చిన్న క్యారెక్టర్లకు అడిషన్లు జరుగుతున్నాయి. సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చాలా ఎక్కువ వుండడంతో సినిమాల్లో చేయాలని ఆశ వున్న చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.