బాహుబలి ఎపిసోడ్ అంటూ ప్రభాస్ తో చేసిన ఇంటర్వ్యూను రెండు భాగాలుగా ప్రసారం చేసింది 'ఆహా'. బాలయ్య-ప్రభాస్-గోపీచంద్ మధ్య జరిగిన ఈ చిట్ చాట్ షోకు సంబంధించి తొలిభాగం పెద్దగా ఆకట్టుకోలేదు. హంగామా ఎక్కువ విషయం తక్కువ. ఇప్పుడు రెండో ఎపిసోడ్ కూడా అదే దారిలో నడిచింది.
ఈరోజు స్ట్రీమింగ్ కు వచ్చిన బాహుబలి ఎపిసోడ్ పార్ట్-2లో కూడా ప్రభాస్ పెళ్లినే ఎత్తుకున్నాడు బాలయ్య. గోపీచంద్ ను అడిగినా, గేమ్ షో అంటూ ఫొటోలు చూపించినా.. ఇలా టాస్క్ ఏదైనా అందులో కామన్ ఎలిమెంట్ ప్రభాస్ పెళ్లి, అతడి గర్ల్ ఫ్రెండ్స్.
నిజానికి పార్ట్-1 ప్రారంభంలోనే తన పెళ్లి, ఎఫైర్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు ప్రభాస్. కానీ 'ఆహా' నిర్వహకులు మాత్రం ప్రభాస్ ప్రేమ-పెళ్లి అంశాన్నే క్యాష్ చేసుకోవడానికి ట్రై చేశారు. అందుకే అటుఇటు తిప్పి తిరిగి ప్రభాస్ ప్రేమ, అతడిపై వినిపిస్తున్న పుకార్ల దగ్గరకే తీసుకొచ్చారు. దీంతో షో చప్పగా సాగింది.
రెండో భాగంలో గోపీచంద్ ను కూర్చోపెట్టారు. నిజానికి ప్రభాస్-గోపీచంద్ ది అరుదైన కలయిక. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇలా కెమెరా ముందు కలిసి కూర్చోవడం ఈమధ్యకాలంలో ఇదే తొలిసారి. భవిష్యత్తులో వీళ్లిద్దరూ మరోసారి ఇలా కెమెరా ముందుకు రాకపోవచ్చు. ఇలాంటి అరుదైన కలయికను 'ఆహా' క్యాష్ చేసుకోలేకపోయింది.
ప్రభాస్-గోపీచంద్ కు ఎలా పరిచయమైందనే విషయాన్ని ప్రస్తావించిన బాలయ్య.. వాళ్లు ఏం మాట్లాడుకుంటారు, ఇద్దరి మధ్య కామన్ గా ఉన్న అభిప్రాయాలు, టేస్టులు ఏంటనే విషయంపై చర్చిస్తే షో ఆహా అనిపించేది. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు.
ఉన్నంతలో ఈ ఎపిసోడ్ లో ఆసక్తిరక విషయాలేమైనా ఉన్నాయంటే అవి రెండు మాత్రమే. గతంలో ప్రభాస్, గోపీచంద్ సినిమాల్లో ఒకేసారి త్రిష నటించింది. ఆమె కాల్షీట్ కోసం తామిద్దరం గొడవపడ్డామనే విషయాన్ని గోపీచంద్ వెల్లడించాడు. ఇక జిల్ సినిమాలో గోపీచంద్ అంత స్టయిలిష్ గా కనిపించడానికి ప్రభాస్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఓ కారణమనే విషయం కూడా ఆసక్తి కలిగించింది.
ఇలాంటి ఒకట్రెండు అంశాలు మినహా, ఆహా అనిపించే మూమెంట్స్ ఈ కార్యక్రమంలో లేవు. ప్రభాస్ మాత్రం తన సహజసిద్ధమైన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి ఇగో, స్టార్ డమ్ చూపించకుండా చాలా నేచురల్ గా బిహేవ్ చేయడం, మాట్లాడడం అతడికే చెల్లింది. చెప్పాలంటే ఈ కార్యక్రమంలో హైలెట్ ఇదే.