చిరంజీవి, బాలయ్య సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తుంటే అభిమానుల మధ్య అల్లర్లు, వాదోపవాదాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా నందమూరి అభిమానులు, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ చూస్తూనే ఉన్నాం. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ చొక్కాలు చించుకొని, నడిరోడ్డుపై కొట్టుకునే రేంజ్ కు వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఇలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరు హీరోల అభిమానుల్ని దిల్ రాజు చిటికెలో కలిపేశాడు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల కోసం ఇటు చిరు, అటు బాలయ్య అభిమానులు కలిసిపోయారు. ఎక్కడా అల్లర్లు, మంటలురేపే స్టేట్ మెంట్స్ కనిపించడం లేదు. అంతా దిల్ రాజు మహత్యం.
ఇంతకీ దిల్ రాజు ఏం చేశారు?
ఇలా చిరు-బాలయ్య ఫ్యాన్స్ కలిసిపోవడానికి దిల్ రాజు ప్రత్యేకంగా ఏం చేయలేదు. తను తీసిన వారసుడు సినిమాను చిరు-బాలయ్య సినిమాలకు పోటీగా దించుతున్నాడు. పనిలోపనిగా తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన థియేటర్లను తన సినిమాకు అట్టిపెట్టుకున్నాడు. సరిగ్గా ఇక్కడే చిరంజీవి, బాలయ్య అభిమానులకు కోపం వచ్చింది.
మంచి థియేటర్లు ఇస్తే బాలయ్యకు ఇవ్వాలి, లేదంటే చిరంజీవికి ఇవ్వాలి. మధ్యలో విజయ్ కు ఇవ్వడం ఏంటంటూ ఇరుహీరోల ఫ్యాన్స్ కలిసి దిల్ రాజుపై పడ్డారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. మెహబూబ్ నగర్ నుంచి అదిలాబాద్ వరకు అన్ని చోట్ల చిరు-బాలయ్య ఫ్యాన్స్ కలిసిపోయారు. తమ అభిమాన హీరోకు మంచి థియేటర్లు దొరికేలా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు.
నిజానికి మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా ఉండేది ఈ వ్యవహారం. ఎప్పుడైతే వారసుడు సినిమాకు జిల్లాల వారీగా యాడ్స్ పడ్డాయో, అందులో థియేటర్ల పేర్లు చూసి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. కీలకమైన మంచి థియేటర్లన్నీ విజయ్ సినిమాకే ఉన్నాయి. ఉదాహరణకు వైజాగ్ సిటీనే తీసుకుంటే, బాలయ్య సినిమాకు మెయిన్ సెంటర్లు ఒకట్రెండు మాత్రమే దొరికాయి. మిగతావన్నీ చిన్నాచితకా థియేటర్లే.
ఇలా చూసుకుంటే, ఇటు చిరంజీవికి కూడా చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, వాదించుకోవడం ఆపేశారు. తమ హీరోకు ఎక్కడ ఎన్ని థియేటర్లు దొరికాయో చెక్ చేసుకునే పనిలో పడ్డారు. అలా ఎలాంటి ఫ్యాన్ వార్స్ లేకుండా వస్తోంది ఈ సంక్రాంతి. ఆ క్రెడిట్ దిల్ రాజుకే ఇవ్వాలి.