ఈట‌ల ఎఫెక్ట్‌… తిరుగుబాటు స్టార్ట్‌!

హుజూరాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ గెలుపు తెలంగాణ‌లో రాజ‌కీయ మార్పున‌కు శ్రీ‌కారం చుడుతుంద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.  Advertisement ఇందుకు త‌గ్గ‌ట్టుగానే అధికార టీఆర్ఎస్‌పై జ‌నం నుంచి అనూహ్య రీతిలో తిరుగుబాటు…

హుజూరాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ గెలుపు తెలంగాణ‌లో రాజ‌కీయ మార్పున‌కు శ్రీ‌కారం చుడుతుంద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఇందుకు త‌గ్గ‌ట్టుగానే అధికార టీఆర్ఎస్‌పై జ‌నం నుంచి అనూహ్య రీతిలో తిరుగుబాటు స్టార్ట్ అయ్యింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం వెలువ‌డి క‌నీసం 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌నే  దాని ఎఫెక్ట్ క‌నిపించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో టీఆర్ఎస్‌ సభ నిర్వహణకు స్థలం ఇవ్వబోమని అక్క‌డి రైతులు తేల్చి చెప్పడం ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఒక అధికార పార్టీ స‌భ నిర్వ‌హ‌ణ‌కు స్థ‌లం ఇవ్వ‌మ‌ని రైతులు తిరుగుబాటు చేయ‌డం చిన్న విష‌యం కాదంటున్నారు. ఇదంతా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ప‌రాజ‌యం ఫ‌లిత‌మ‌ని చెబుతున్నారు.

టీఆర్ఎస్‌ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి కావ‌స్తోంది. దీన్ని పుర‌స్క‌రించుకుని వరంగల్‌లో ‘విజయ గర్జన’ సభ నిర్వహించాల‌ని అధికార పార్టీ టీఆర్ఎస్ నిర్ణ‌యించింది. 

టీఆర్ఎస్‌కు వ‌రంగ‌ల్ గుండెకాయ లాంటిది. సభ ఏర్పాట్లలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఇత‌ర నాయకులు దేవన్నపేటలో సభా స్థలాన్ని ప‌రిశీలించేందుకు వెళ్లారు.

గ్రామ శివారులోని పంట పొలాలతో పాటు ఖాళీ ప్రదేశాన్ని ప‌రిశీలిస్తున్న‌ ప్రజాప్రతినిధుల వద్దకు స్థానిక రైతులు వెళ్లి త‌మ అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. పంట పండే తమ పొలాలను స‌భ నిర్వ‌హ‌ణ‌కు ఇచ్చే ప్ర‌శ్నే లేద‌ని ఆందోళనకు దిగారు. 

రైతుల‌కు బీజేపీ నేత‌లు అండ‌గా నిలిచారు. దీంతో టీఆర్ఎస్ స్థానిక నాయ‌కులు, రైతులు, బీజేపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప‌ర‌స్ప‌రం తోపులాట‌కు దిగ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువ‌ర్గాల‌కు పోలీసులు స‌ర్ది చెప్పారు.  

రానున్న‌ది బీజేపీ ప్ర‌భుత్వ‌మే అని ఆ పార్టీ నాయ‌కులు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏకంగా టీఆర్ఎస్ స‌భా నిర్వ‌హ‌ణ‌కే అడ్డు త‌గ‌ల‌డం సీరియ‌స్ అంశ‌మే అని చ‌ర్చ జ‌రుగుతోంది.