హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం కావడం, ఆ పార్టీలో మంటను రాజేసింది. ఎన్నడూ లేనంతగా పార్టీ దిగజారి పోవడానికి టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
బీజేపీతో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కేవలం 12 రోజుల ముందు మాత్రమే అభ్యర్థిని ప్రకటించారని కాంగ్రెస్‌లో అసమ్మతి వాదులు తమ విమర్శలకు పదును పెట్టారు.
ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కీలకంగా మారింది. ఈ సమావేశానికి వెళ్లే ముందు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే 2023 వరకు పార్టీ వ్యవహారాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఇవాళ్టి సమావేశంలో చివరి సారిగా తాను మాట్లాడతానని తేల్చి చెప్పారు. తనను ఓ వర్గం మీడియా టార్గెట్ చేస్తోందని వాపోయారు. వాస్తవాలు చెప్పడమే నేరమన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
వాస్తవాలు చెప్పే తనపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. అందువల్లే ఇకపై ఏమీ మాట్లాడకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చానన్నారు. ఈ రోజు లాస్ట్ మీటింగ్‌లో ఏదో ఒకటి తేల్చుకుంటానన్నారు. ఇకపై గాంధీ భవన్‌లో మాట్లాడాలా వద్దా అనేది ఈ రోజు తేలిపోతుందన్నారు.
కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌కు ఏం తెలియదన్నారు. మంచి చెప్తే వినకపోతే తనదేంపోతుందని ప్రశ్నించారు. అన్ని విషయాలు లోపలే మాట్లాడ్తానని చెప్పారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమే తన బలహీనత అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
హుజూరాబాద్‌కు స్టార్‌లు, సూపర్ స్టార్‌లు పోతేనే దిక్కు లేదని, అలాంటిది తాను పోతే ఓట్లు పడతాయా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించడం గమనార్హం.