నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పరాజయం కావడం, తను నిర్మించిన మీకు మాత్రమే చెప్తా కూడా అదే దారి పట్టడంతో హీరో విజయ్ దేవరకొండ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.
ఈసారి రాబోయే సినిమా కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిన పరిస్థితి కనిపిస్తుండడంతో, నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా వుంటున్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా కొత్త దర్శకుల మీద బేస్ కావడం తగ్గించాలనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం చేస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు పని చేస్తున్నది క్రాంతి మాధవ్. ఇప్పటికే రెండు సినిమాలు అందించిన డైరక్టర్.
అలాగే ఫైటర్ సినిమాకు దర్శకుడు పూరి జగన్నాధ్. మోస్ట్ సీనియర్ నే. మధ్యలో చేయాల్సిన హీరో సినిమాకే కొత్త దర్శకుడు పని చేస్తున్నారు.దాని తరవాత మళ్లీ అనుభవం వున్నదర్శకుడితోటే విజయ్ పని చేస్తారని తెలుస్తోంది.శివ నిర్వాణ పేరు ఈ మేరకు వినిపిస్తోంది.
అందుకే హీరో సినిమాను వెనక్కు నెట్టి, పూరి సినిమాను ముందుకు తేవాలని డిసైడ్ అయ్యారు. పూరికి ఫోన్ చేసి డిసెంబర్ కు రెడీ అయిపోమని చెప్పేసారు.
అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బోగట్టా. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక, తను చూసిన తరువాతనే విడుదల డేట్ వేద్దామని నిర్మాతకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈసారి రాబోయే విజయ్ సినిమా కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందే. లేదూ అంటే విజయ్ మార్కెట్ తేడా వస్తుంది. అందుకే రాబోయే రెండు సినిమాల లైనప్ కరెక్ట్ గా వుండాలని చూస్తున్నారు.
అదీ కాక హీరో సినిమా కాస్త బిగ్ బడ్జెట్ మూవీ. రెండు సినిమాలు హిట్ కొట్టిన తరవాత వస్తే మార్కెట్ సరిపోతుంది. అందుకే దాన్ని వెనక్కు పెట్టినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఆ సినిమా మీద మైత్రీ మూవీస్ సంస్థ కాస్త భారీగా ఖర్చుచేసేసింది కనుక, ప్రాజెక్టును ఆపేస్తుందని అనుమానించనక్కరలేదు. ఎందుకంటే పెట్టిన ఖర్చు కోట్లలో వుండడమే అందుకు కారణం అనుకోవాలి.