కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ విచిత్రంగా ఉంది. ఆయన టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారిచినంత వరకు బాగానే ఉంది. ఆయన అనుకున్న రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయా లేదా అనేది వేరే సంగతి. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి దానికి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్నారు. అది సరైనదే. కానీ ఎప్పుడైతే ప్రాతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చారో దానికి జాతీయ పార్టీ లక్షణాలు ఉండాలి కదా.
బీఆర్ఎస్ లో అదే లోపించింది. జాతీయ పార్టీకి సహజంగానే కేసీఆర్ అధ్యక్షుడు అవుతారు. రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులు ఉంటారు. ఉండాలి కూడా. కేసీఆర్ ఏపీకి ఈమధ్యనే తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించారు. కానీ కేసీఆర్ సొంత రాష్ట్రమైన తెలంగాణాకు అధ్యక్షుడిని నియమించలేదు.
ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర అద్యక్షుడిగా కేసీఆరే కొనసాగుతున్నారు. ఇదేమి విధానం? టీడీపీని జాతీయ పార్టీగా చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. దానికీ జాతీయ పార్టీ లక్షణాలు లేవనే చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబు తాను జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ తెలంగాణా, ఆంధ్రాకు అధ్యక్షులను నియమించారు. కానీ కేసీఆర్ ఇప్పటివరకు ఆ పని చేయలేదు. బీఆర్ స్ పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడు. బాగానే ఉంది. అలాంటప్పుడు కుమారుడు కేటీఆర్ ను పార్టీ తెలంగాణా అధ్యక్షుడిగా నియమించవచ్చు కదా. మరి ఆ పని ఎప్పుడు చేస్తారో.
ఇదిలా ఉంటే….పార్టీ విస్తరణలో భాగంగా ముందు ఏపీపైనే కన్నేశారు. కర్నాటక ఎన్నికల బరిలో దిగుతారనుకుంటే ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పార్టీ ఆవిర్భావ సభ, నేతల పరిచయం తదితర కార్యక్రమాలను భారీ ఎత్తున చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సమాయాత్తమవుతోంది.
ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ని బీఆర్‌ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు కేసీఆర్. త్వరలోనే మిగిలిన అన్ని శాఖలకు సంబంధించిన టీమ్ ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ వేదిక నుంచే బీఆర్‌ఎస్ మేనిఫెస్టో కూడా ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ రాకతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంతేకాదు కేసీఆర్ వ్యూహంలో ఎవరు చిక్కుకుంటారు ..ఎవరు లాభపడతారు అన్నదానిపై జోరుగా బెట్టింగ్ లు, చర్చలు కూడా నడుస్తున్నాయి.
విపక్షాలు ఈ విషయంలో కాస్తంత దూరంగా ఉంటే అధికారపార్టీ మాత్రం మాకెలాంటి భయమూ లేదన్న విషయాన్ని స్ఫష్టం చేసింది. త్వరలో పెట్టనున్న బహిరంగ సభకు వచ్చే జనాలను బట్టే ప్రజాదరణ కూడా ఉంటుందన్న అంచనాకు వస్తున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ సభ సక్సెస్ అయితే కాంగ్రెస్ కి కూడా ప్రజల ఆదరణ ఉంటుందన్న నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయట. అందుకే బీఆర్‌ఎస్ సభ విజయవంతం కావాలని అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్ ఎక్కువగా కోరుకుంటోందన్న సెటైర్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సభలు, సమావేశాలకు జనాలు వచ్చినంత మాత్రాన ఓటింగ్ రూపంలో అవి మారతాయన్న నమ్మకం లేదన్న విషయాన్ని పార్టీలు గుర్తుంచుకుంటే మంచిదని రాజకీయ నిపుణులు సలహా ఇస్తున్నారు.