మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దాయనగా పిలుస్తుంటారు. చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారారు. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతను నెత్తికెత్తుకున్న పెద్దాయన ఈయనే. పెద్దిరెడ్డి ఎంటర్ అయ్యారంటే అక్కడ రౌడీయిజం రాజ్యమేలుతుందని ప్రత్యర్థులు ప్రధానంగా చేసే విమర్శ. కుప్పంలో నిన్న చంద్రబాబు మాట్లాడుతూ పెద్దిరెడ్డిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.
తాను అనుకుని వుంటే… అసలు చిత్తూరు జిల్లాలో తిరిగే వాడివా రామచంద్రారెడ్డి అని చంద్రబాబు నిలదీశారు. పుంగనూరుకు నువ్వేమైనా పుడింగివి అనుకుంటున్నావా? అని పెద్దిరెడ్డిని నిలదీశారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి తగ్గేదేలే అంటూ ఎదురు దాడికి దిగారు. ఏమనుకుంటున్నావ్? నీ సంగతిని ఎప్పుడో తేల్చా అంటూ పాతరోజులను పెద్దిరెడ్డి గుర్తు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చంద్రబాబునాయుడు మధ్య ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచే రాజకీయ వైరం వుంది.
కాలేజీ రోజుల నుంచి చంద్రబాబుపై తనదే పైచేయి అని పెద్దిరెడ్డి తాజాగా గుర్తు చేయడం విశేషం. అలాగే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఓటుతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నట్టు పెద్దిరెడ్డి గుర్తు చేశారు. తనను పుడింగి అన్న నేపథ్యంలో …ఆ పదానికి అర్థం బలమైన వాళ్లని అర్థమని చెబుతూ, తాను ఎలా ఆధిపత్యం చెలాయించారో పెద్దాయన వివరించారు.
చంద్రబాబు, పెద్దిరెడ్డి ఒకప్పుడు ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు. బాబు కంటే పెద్దిరెడ్డి ఒక ఏడాది జూనియర్. చంద్రబాబు ఎకనామిక్స్ , పెద్దిరెడ్డి సోషియాలజీ విద్యార్థులు. ఎస్వీయూలో 1970 దశకంలో రెడ్ల విద్యార్థుల ఆధిపత్యం వుండేది. 1974లో చంద్రబాబు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఎస్వీయూలో పరోక్ష పద్ధతిలో చైర్మన్ ఎన్నికలు జరిగేవి. 1974లో ఎస్వీయూలో ఒకట్రెండు డిపార్ట్మెంట్లు మినహా మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ రెడ్ల సామాజిక విద్యార్థుల మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. ఆ ఏడాది కేవీ రమణారెడ్డి అనే విద్యార్థి ఎస్వీయూ చైర్మన్గా ఎన్నికయ్యారు.
ఆ మరుసటి ఏడాది 1975లో ఎస్వీ విశ్వవిద్యాలయం చైర్మన్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు పని చేసినప్పటికీ, ఆయన గెలుపును అడ్డుకోలేకపోయారు. అప్పటి నుంచి వాళ్ల మధ్య మొదలైన వైరం, ఆ తర్వాత కాలంలో కూడా ఇప్పటికీ రాజకీయంగా కొనసాగుతూనే వుంది. చంద్రబాబులో చతురత ఎక్కువ. పెద్దిరెడ్డికి ఆవేశం ఎక్కువ, లౌక్యం తక్కువ. ఏదైనా మొహం మీదే మాట్లాడే స్వభావం. చంద్రబాబు తనకు అనుకూల పరిస్థితులు లేవని తెలిస్తే… రాజీపడే ధోరణి. ఇదే పెద్దిరెడ్డి విషయానికి వస్తే…ఏటికి ఎదురీదే మనస్తత్వం. ప్రస్తుతం కుప్పం కేంద్రంగా వాళ్లిద్దరి మధ్య తీవ్ర పోరు సాగుతోంది. ఏమవుతుందో చూడాలి.