భ‌ర్త కోసం టీడీపీలోకి మాజీ మంత్రి!

భ‌ర్త ద‌యాసాగ‌ర్ కోసం మాజీ మంత్రి, ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. సుచ‌రిత భ‌ర్త ద‌యాసాగ‌ర్ బాప‌ట్ల లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.…

భ‌ర్త ద‌యాసాగ‌ర్ కోసం మాజీ మంత్రి, ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. సుచ‌రిత భ‌ర్త ద‌యాసాగ‌ర్ బాప‌ట్ల లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ద‌యాసాగ‌ర్‌కు బాప‌ట్ల లోక్‌స‌భ సీటు ఇవ్వాల‌ని గ‌తంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎదుట ఆమె ప్ర‌తిపాద‌న పెట్టారు. దాన్ని ఆయ‌న సున్నితంగా తిరస్క‌రించారు. మ‌రోవైపు హోంశాఖ మంత్రిగా ప‌ని చేసిన త‌న‌ను తొల‌గించ‌డ‌పై కూడా ఆమె గుర్రుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కొంత కాలంగా పార్టీ, ప్ర‌భుత్వంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు.

ద‌యాసాగ‌ర్ విష‌యానికి వ‌స్తే… 1992 బ్యాచ్ ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీసెస్ (ఐఆర్ఎస్‌) అధికారి. ఆదాయ‌ప‌న్నుశాఖ అధికారిగా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌నిచేశారు. 2021, అక్టోబ‌ర్ 27న విజ‌య‌వాడ‌లో అదాయ ప‌న్నుశాఖ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్ప‌టికి సుచ‌రిత హోంశాఖ మంత్రి. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కే ఆయ‌న మ‌ద్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌కు బ‌దిలీ అయ్యారు. అక్క‌డ ప‌నిచేస్తూ వీఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం, గ‌త ఏడాది జూన్ 7న‌ రాష్ట్ర‌ప‌తి ఆమోదించ‌డం అన్నీ జ‌రిగిపోయాయి.

అప్ప‌టి నుంచి ఆయ‌న బాపట్ల బ‌రిలో నిలిచేందుకు చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. టీడీపీ ముఖ్య‌నేత‌ల‌తో నిత్యం ట‌చ్‌లో ఉంటున్నారు. బాప‌ట్ల ఎంపీ టికెట్ ద‌యాసాగ‌ర్‌కు, ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే టికెట్ సుచ‌రిత‌కు ఇచ్చేందుకు టీడీపీ అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. అయితే అనారోగ్య కార‌ణంగా ఎన్నిక‌ల‌కు దూరంగా వుండాల‌ని ఆమె నిర్ణ‌యించుకున్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సుచ‌రిత భ‌ర్త టీడీపీలో జాయిన్ అవుతార‌నే ప్ర‌చారాన్ని ఆమె ఖండించ‌క‌పోగా, వాటికి బ‌లం క‌లిగించేలా రెండు రోజుల క్రితం సుచ‌రిత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

పార్టీ మార‌తాను…నువ్వు నాతో రా అంటే ఎంత రాజ‌కీయ నాయ‌కురాలైనా భ‌ర్త‌తో వెళ్లాల్సిందేగా అని ఆమె అన‌డంతో దంప‌తులిద్ద‌రూ టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన సంద‌ర్భంలో సుచ‌రిత కుమార్తె…ఇక‌పై త‌న త‌ల్లి పోటీ చేయ‌ర‌ని ప్ర‌క‌టించ‌డాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. సుచ‌రిత దంప‌తులు ప‌క్క చూపులు చూస్తున్నార‌నే ప‌క్కా స‌మాచారంతో జ‌గ‌న్ వారి అల‌క‌ను ప‌ట్టించుకోలేద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ద‌యాసాగ‌ర్‌, సుచ‌రిత పార్టీ మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.