తప్పు జరిగింది అని ఒప్పుకుంటే హుందాతనం. కానీ మాదే ఒప్పు తప్పంతా మీది అనడం ఇరుకు రాజకీయంగానే చూడాలని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఒక విషయం మరచిపోయి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు సభలకు జనం విరగబడి వస్తున్నారని, అది చూసి ఓర్వలేక చీకటి జీవోలను అధికార వైసీపీ తీసుకువచ్చిందని వారు గట్టిగా వాదిస్తున్నారు.
కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం ఏంటి అంటే పదకొండు మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోవడం. కందుకూరు, గుంటూరు సభల వల్లనే ఇది జరిగింది అని అందరికీ తెలుసు. బాబు సభలకు కిక్కిరిసి పోటెత్తిన జనాలు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాస్తోంది. అంటే ఇంతకు ముందు ఇలా జనాలు విరగబడి రాలేదని ఒక వైపు ఒప్పుకుంటున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి.
ఇపుడు ఇంతలా జనాలు ఎందుకు వస్తున్నారు, బాబు అయిదేళ్ల పాలన మరీ అంతగా నచ్చిందా అంటే గడచిన మూడున్నరేళ్ళుగా ఏపీలో ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలలో తెలుగుదేశం పెర్ఫార్మెన్స్ మరీ పూర్ గా ఉంది. పోనీ ఆ ఎన్నికల తరువాత అధికార పార్టీ గ్రాఫ్ తగ్గిపోయిందని, టీడీపీ పుంజుకుందని తమ్ముళ్ళు భావిస్తూంటే పొత్తుల కోసం ఎదురు చూడడం ఎందుకో అర్ధం కాదనే అంటున్నారు.
ఒక వైపు ఎపుడు ఎన్నికలు వచ్చినా 160 సీట్లు అంటూ బాబాయి అచ్చెన్నాయుడు, అబ్బాయి రామ్మోహననాయుడు హోరెత్తిస్తారు. అంత ధీమా ఉంటే పొత్తుల ఎత్తుల పాకులాటలు ఎందుకో అసలు విషయం చెప్పరు. తెలుగుదేశం సభలకు చంద్రబాబు జనాదరణకు బెదిరి జగన్ చీకటి జీవోలు తెచ్చారు అని ఎంపీ రామ్మోహన్ తాజాగా ఆరోపించారు.
సభలకు వస్తున్న జనాలను చూసి జడిసి బెరుకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. బెరుకు సంగతి పక్కన పెడితే ఇరుకు సందుల మీటింగులతో రాజకీయాలు చేయడం మీద మాత్రం తమ్ముళ్ళు నోరెత్తడంలేదు. ప్రజాదరణ పుష్కలంగా ఉందనుకున్నపుడు అతి పెద్ద మైదాన ప్రాంతంలో సభలకు నిర్వహించి రాజకీయ ప్రత్యర్ధి వైసీపీ కళ్ళు తెరిపించవచ్చు కదా. తమకే జనం మొత్తం జై కొడుతున్నారని చెప్పుకోవచ్చుగా.
ఏపీలో సభల నిషేధం లేదు కదా. ఉన్నదల్లా రోడ్ల పైనా మీటింగులు మాత్రమే రద్దు చేశారు. ఈ మాత్రానికే లబలబలాడడం ఎందుకంటే తమ్ముళ్ళు జవాబు చెప్పలేరేమో. ఇరుకు రాజకీయాలు చేస్తూ బెరుకు మీకు అంటున్న టీడీపీకే నిజమైన కలవరం అని వైసీపీ వారు అంటున్నారు. రాజకీయాలు సంగతి కాసేపు అలా ఉంచితే పోయిన పదకొండు మంది ప్రాణాల విషయంలో కనీసం వశ్చాత్తాపం లేని రాజకీయాన్ని చూసి జనాలు ఏమిటీ మురికి రాజకీయం అనుకుంటున్నారు.