ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికలు సమీపించే నాటికి పార్టీలో అసమ్మతి గళాలు పెరిగే సూచనలున్నాయని ఆయన గ్రహించారు. అభ్యర్థుల ఎంపిక నాటికి ఇది మరింత తీవ్రం అవుతుందని ఆయనకు ముందే తెలుసు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రత్యామ్నాయం రెడీ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఎందుకో తొందరపడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తి చాలా కాలంగా ఆయనలో వుంది. ఇలాంటి అసంతృప్తి సహజంగానే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో వుంది. వారెవరూ ఆనంలా బయట పడలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో అందరినీ సంతృప్తిపరచడం జగన్‌కు సాధ్యం కాలేదు. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరికకు దారి తీసిన పరిస్థితులు వేరు. ఒకప్పుడు జగన్‌ను ఆర్థిక ఉగ్రవాదిగా తిట్టిపోసిన నేత ఆనం రామనారాయణరెడ్డి. రాజకీయ అవసరాల రీత్యా వైసీపీలో ఆనం చేరారనేది బహిరంగ రహస్యమే.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి తన వెంట నడిచిన ఎమ్మెల్యేలకే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఆ తర్వాత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కూడా ఆ అభిమానంతోనే మంత్రి పదవులు ఇచ్చారు. జగన్ పదవుల కేటాయింపునకు ఓ లెక్క వుంటుంది. రేపు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇదిలా వుండగా ఆనం నోటి దురుసు ఎక్కువైన నేపథ్యంలో వెంటనే కోరలు పీకేశారు.
వెంకటగిరి అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి అని జగన్ తేల్చేశారు. పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే సొంత పార్టీ నేతలెవరికైనా ఇదే గతి అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏఏ నియోజకవర్గాల్లో ఎవరెవరి పరిస్థితి ఏంటనే విషయమే ఎప్పటికప్పుడు నివేదికలను జగన్ తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఓ 15 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమీ బాగాలేదనే అభిప్రాయానికి వచ్చారు.
అక్కడ ఎమ్మెల్యేలను మార్చేందుకు ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో అక్కడ ప్రత్యామ్యాయంగా నాయకులను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వెళ్లినా నష్టం జరగకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ప్రత్యామ్యాయంగా నాయకులను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ పెద్దలపై జగన్ పెట్టారని విశ్వసనీయ సమాచారం. టికెట్ తమకు దక్కదనే అనుమానం ఉన్న వారు రానున్న రోజుల్లో సహజంగానే వ్యతిరేక గళమెత్తుతారు. ఆ లోపే వారి వెంట కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్లకుండా జగన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.