సంక్రాంతి సినిమాల గొడవలు మామూలుగా లేవు. తెరవెనుక థియేటర్ల కోసం ఓ లెక్కలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికి చాతనయిన సాయం వారు చేస్తున్నారు. సినిమా జనాలు, ఫ్యాన్స్ ఇలా ఎవరి లెవెల్ లో వాళ్లు ఇటు బాలయ్య సినిమాకో, అటు మోగా సినిమాకో థియేటర్ల కోసం తమ ప్రయత్నాలు చేస్తూ, తమకు చాతనైన సాయం అందిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఓ సీనియర్ హీరో మెగాస్టార్ కోసం తన సాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు సీనియర్ హీరో కు ఆంధ్రలోని కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఏరియాల్లో పంపిణీ రంగంలో ప్రవేశం వుంది. తమ సంస్థ తరపున ఆ ఏరియాల్లో అప్పుడప్పుడు సినిమాలు పంపిణీ చేస్తుంటారు. ఆ అనుభవంతో, ఆ పరిచయంతో మెగా స్టార్ సినిమాకు థియేటర్లు వచ్చేలా తన వంతు మాట సాయం తాను చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ హీరో కు మెగాస్టార్ కు మంచి అనుబంధం వుంది. అదే సమయంలో బాలయ్యతో అంతగా పొసగదు అని వార్తలు కూడా వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ కు అనుకూలంగా ఆంధ్రలో థియేటర్ల కోసం లాబీయింగ్ చేయడం అంటే బాలయ్య వర్గాన్ని కాస్త అసంతృప్తికి గురి చేయడమే అవుతుంది.
అయితే ఎవరు లాబీయింగ్ చేసినా సమస్య ఏమిటంటే చాలా థియేటర్లు ఏదో ఒక పంపిణీ దారుకు లీజు ఇచ్చేసి వుంటాయి. అందువల్ల థియేటర్ ఓనర్ చేయగలిగింది తక్కువ. మొత్తం మీద థియేటర్ల వ్యవహారం తెరవెనుక కాస్త గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది.