కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. మోడీ మీద పగతో, ఆయన పతనాన్ని కోరుకుంటూ తన తెలంగాణ రాష్ట్రసమితిని.. భారత రాష్ట్ర సమితిగా మార్పు చేశారు. దేశవ్యాప్తంగా సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తానని, తెలంగాణ మోడల్ అభివృద్ధిని యావత్ దేశానికి అందిస్తానని అంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా తన అస్తిత్వాన్ని బలంగా నిరూపించుకోవడానికి సోదర తెలుగురాష్ట్రంలో కూడా పార్టీని ప్రారంభించడం, కార్యకలాపాలతో దూసుకెళ్లడం జరుగుతోంది. అయితే ఒకప్పట్లో సీమాంధ్రులను అంత్యంత హేయంగా దూషించిన నిందించిన, హైదరాబాదులో బతకాలంటేనే భయపడేలా చేసిన కేసీఆర్ కు ఏపీలో ఎంత మాత్రం ఆదరణ దక్కుతుంది. సందేహమే. అయినా సరే.. ఆయన ఏదో తన పార్టీకి కొందరు నాయకుల్ని తీసుకుని, ఆఫీసు పెట్టే పనిలో ఉన్నారు.
సరే ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేస్తున్నారు. కానీ ఏపీలోని రాజకీయ పార్టీల వారు కేసీఆర్ భారాసను ఎంత మేరకు సీరియస్ గా తీసుకుంటున్నారు? అధికార వైసీపీ విషయానికి వస్తే.. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆయన పార్టీ మంచిదేనని, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావొచ్చునని వ్యాఖ్యానిస్తూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అదే చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన ఎదుట భారాస గురించి ప్రస్తావిస్తే నవ్వి ఊరుకున్నారు.
కానీ.. జనసేన పవన్ కల్యాణ్ మాత్రం ఉలికిపడుతున్నారు. ఆయన పార్టీ తరఫున రాజకీయ వ్యవహారాల కమిటీ సారథి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. భారాస ముసుగులో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి సహకారం అందించి, జనసేనకు వచ్చే ఓట్లు చీల్చేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారట. బంగారు ఆంధ్ర కోసం కేసీఆర్ ఎన్నడైనా మాట్లాడారా అని కూడా అడుగుతున్నారు. కేసీఆర్ భారాస ఏపీలో పెద్దగా ప్రభావం చూపడం కష్టం అనేది అందరూ ఒప్పుకునే సంగతి. కానీ.. జనసేన మాత్రమే ఉలికిపాటుకు గురికావడం, కేసీఆర్ మీద విమర్శలు చేయడం చూస్తోంటే వారి బలం మీద వారికే నమ్మకం లేనట్టుగా ఉంది.
పాపం జనసేన పార్టీకి ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతూ వచ్చిన తోట చంద్రశేఖర్ వంటి నాయకులు.. హఠాత్తుగా పార్టీని వీడివెళ్లిపోతే ఈ మాత్రం బాధ ఉండడం సహజం. తన ఏటీఎం వెళ్లిపోయిందనే ఉక్రోషంలో నాదెండ్ల మనో హర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
జనసేన ఓట్లు చీల్చడానికి కేసీఆర్ ఇలా చేస్తున్నారని నాదెండ్ల ఏ ప్రాతిపదికమీద అంటున్నారు? జనసేనకు కాపుల ఓట్లు మాత్రమే వస్తాయని ఆయన అనుకుంటున్నారా? జనసేనను నమ్ముకుని ఓడిపోయిన నాయకులు సాధించిన ఓట్లెన్ని, వారు భారాసకు వెళ్లడం వలన చీలే ఓట్లెన్ని? అని ప్రజలు నవ్వుకుంటున్నారు.