సీఎంను అదృష్టం వరిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనం 2019 ఎన్నికల్లో తేలిపోగానే.. తన దారి తాను చూసుకుని, బిజెపిలో చేరిపోయి జాగ్రత్త పడిన ప్రముఖుల్లో సీఎం రమేష్ కూడా ఒకరు. లోప్రొఫైల్ కనిపించే ఈ నాయకుడి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనం 2019 ఎన్నికల్లో తేలిపోగానే.. తన దారి తాను చూసుకుని, బిజెపిలో చేరిపోయి జాగ్రత్త పడిన ప్రముఖుల్లో సీఎం రమేష్ కూడా ఒకరు. లోప్రొఫైల్ కనిపించే ఈ నాయకుడి చాణక్య రాజకీయ తెలివితేటలకు అది పెద్ద నిదర్శనం. నిత్యం కాంట్రాక్టులు, వ్యాపారాల మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ తో కనిపించే ఈ నేత రాజకీయంగా సేఫ్ పొజిషన్ లోకి వెళ్లిపోయారు. అలాంటి సీఎం రమేష్ కు ఇప్పుడు అదృష్టం కలిసి వస్తే కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.

కేంద్రంలోని నరేంద్రమోడీ మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించడానికి బిజెపి ప్లాన్ చేస్తోంది. జనవరి 29 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ లోగానే మంత్రివర్గాన్ని విస్తరించాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో.. వాటికి తగినట్టు కేంద్ర కేబినెట్ టీమ్ లో కొన్ని మార్పు చేర్పులు అవసరం అని బిజెపి భావిస్తున్నది.కేంద్ర కేబినెట్ లో 83 మంది మంత్రులకు చోటుంది. అయితే ఇప్పుడు కేవలం 78 మంది మాత్రమే ఉన్నారు. పార్టీ అవసరాలు, వ్యూహాల ప్రకారం వీరిలో కొందరిని రాష్ట్రాలకు పంపడం, రాష్ట్రాల నుంచి కొందరిని కేంద్రమంత్రులుగా తీసుకురావడం వంటి మార్పు చేర్పులతో పాటు మిగిలిన ఐదు ఖాళీలను కూడా భర్తీ చేసి సరికొత్త కేంద్ర కేబినెట్ తో ఎన్నికలకు వెళ్లాలనేది మోడీదళం ప్లాన్. 

అయితే.. తెలుగురాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. అక్కడ పార్టీకి మరో నలుగురు ఎంపీలు ఉన్నారు. తెలంగాణలో పార్టీని చాలా దూకుడుగా ముందుకు తీసుకువెళుతున్న బండి సంజయ్ పట్ల బిజెపి అధిష్టానానికి సానుకూల అభిప్రాయమే ఉంది. ఈ లెక్కన, తెలంగాణకు మరో చాన్స్ ఇవ్వదలచుకుంటే ఆయన రేసులో ముందున్నట్టే లెక్క. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేంద్రమంత్రి పదవి దక్కుతుందా లేదా? అనే చర్చ నడుస్తోంది. 

ఏపీలో అసలు బిజెపికి ఎంపీలే లేరు. పార్టీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ఉన్నప్పటికీ.. ఆయనను యూపీ కోటాలో ఎంపీని చేశారు. తెలుగుదేశం నుంచి ఫిరాయించి వచ్చిన సీఎం రమేష్ కూడా కేంద్రమంత్రి పదవిని ఆశిస్తున్నారు. 

అయితే బిజెపిలో చేరేవరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులైన నాయకుల్లో ఒకరుగా సీఎం రమేష్ కు పేరుంది. సీఎం రమేష్.. బిజెపిలో చంద్రబాబు కోవర్టు అని ఆరోపించే వారు కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు పదవి ఇస్తారా అనేది అనుమానమే. అలాగే జీవీఎల్ పేరు తెరపైకి వస్తున్నా.. ఆయన జగన్ అనుకూలవైఖరితో ఉంటారనే ముద్ర ఉంది. ఆయనకు పదవి ఇస్తే గనుక.. జగన్ సర్కారు పట్ల కేంద్రబిజెపి మెతకగా ఉన్నట్టు అనుకోవాల్సి వస్తుంది. 

ఏపీలో బాగా విస్తరించాలని, ఏదో ఒక నాటికి అధికారానికి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని కలలు కంటున్న బిజెపి.. కనీసం ఈ రాష్ట్రానికి ఒక మంత్రి పదవినైనా ఇస్తుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.