వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంటే కేవలం రఘురామకృష్ణంరాజు మాత్రమే గుర్తుకు వస్తున్నారట జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులంటే ఎవరి పేర్లూ గుర్తుండవట! ఇదీ జనసేనాని సెలవిచ్చిన వైనం!
పాపం.. ఏపీలో ఎంపీలంటే జనసేన అధిపతికి కేవలం రఘురామకృష్ణంరాజు మాత్రమే గుర్తున్నారట. సొంత నియోకవర్గం అడ్రస్ మరిచిపోయి, అనుచిత ప్రేలాపనతో సగటు మనిషి నుంచి ఛీత్కారాలు పొందుతున్న ఆర్ఆర్ఆర్ మాత్రమే పవన్ కల్యాణ్ కు గుర్తున్నట్టుగా ఉన్నాడు.
అంతకు మించి ఏపీలో ఎంపీలెవరూ పవన్ కల్యాణ్ దృష్టిలో పడనట్టుగా ఉన్నారు. దీన్నే అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవాలి కాబోలు. మనం దేని గురించి ఆలోచిస్తామో, దేని గురించి సెర్చ్ చేస్తూ ఉంటామో.. అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. పవన్ కల్యాణ్ విషయంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రఘురామకృష్ణం రాజు మీద పని చేస్తూ ఉన్నట్టుగా ఉంది!
అయితే పవన్ కల్యాణ్ కాస్త పత్రికలు చదవాలి. పోకడలను గమనించాలి. ఆయన దృష్టి ఎంతసేపూ ఆర్ఆర్ఆర్ మీదే ఉంటే ఎవ్వరూ చేసేదేమీ లేదు. దాని వల్ల ప్రజలకు కూడా నష్టం లేదు. కాసేపు పొలిటికల్ మసాలానే పవన్ ఎక్కువ పట్టించుకుంటున్నట్టుగా ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంటే.. గత ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారే వారు! రాయలసీమలో కొత్తగా ఉదయించారే బీసీ నేతలు వారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో ఒకరు.. ప్రస్తుతం అంతర్జాతీయ వాతావరణ సదస్సులో పాల్గొంటున్నారు పవన్ కల్యాణ్ గారూ!
గ్లాస్గోలో జరిగిన ఆ క్లైమేట్ పార్లమెంట్ లో పాల్గొనడానికి దేశం మొత్తం మీదా ముగ్గురు ఎంపీలకు ఆ అవకాశం దక్కితే, వారిలో ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నారు. ఆ సదస్సుకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అతి తక్కువ ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సదస్సుకు వివిధ దేశాల అధినేతలతో సహా భారత ప్రధానమంత్రి మోడీ కూడా హాజరయ్యారు.
ఇలాంటివి పవన్ కల్యాణ్ దృష్టికి రాకపోవచ్చు. బహుశా పవన్ టేస్టు ఆర్ఆర్ఆర్ మీదే ఉన్నట్టుగా ఉంది. యధ్బావం తద్భవతి అని.. అన్నారు పవన్. మొన్ననే వైఎస్ఆర్సీపీ మంత్రి ఒకరిని సన్నాసి అన్నావు. ఆయనేమో ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో మంత్రులే తెలియడం లేదంటున్నావు. బహుశా తెలంగాణలో సెటిలర్ కాబట్టి.. ఏపీకి చుట్టపు చూపే కాబట్టి.. ఏపీ మంత్రులెవరో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదులే!