బాబుకి బద్వేల్ పాఠం.. బీజేపీతో లాభం లేదిక!

2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు గ్యారెంటీ అనుకుంటున్న చంద్రబాబు, బీజేపీ విషయంలోనే కాస్త ఆలోచనలో పడ్డారు. అనవసర భారం ఎందుకు అనుకుంటే, బీజేపీతో జనసేనకు తెగతెంపులు చేసి మరీ తనవైపు తెచ్చుకుంటారు. ఈ సమయంలో…

2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు గ్యారెంటీ అనుకుంటున్న చంద్రబాబు, బీజేపీ విషయంలోనే కాస్త ఆలోచనలో పడ్డారు. అనవసర భారం ఎందుకు అనుకుంటే, బీజేపీతో జనసేనకు తెగతెంపులు చేసి మరీ తనవైపు తెచ్చుకుంటారు. ఈ సమయంలో బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు బాబుకి ఓ క్లారిటీ ఇచ్చాయి. 

బీజేపీతో పని జరగదని తేలిపోయింది. గతంలో బీజేపీతో కలసి ప్రయాణం చేయకపోవడం నష్టం అనుకున్న చంద్రబాబు.. 2024 నాటికి బీజేపీని నమ్ముకుంటే నిండా మునగడం ఖాయం అని స్పష్టమవుతోంది.

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభ తగ్గుతోంది. జీఎస్టీ విధానాలు, వ్యవసాయ చట్టాలు, ఇంధన ధరలను విపరీతంగా పెంచడం వంటి నిర్ణయాలతో.. బీజేపీ ఇప్పటికే తప్పుమీద తప్పు చేస్తోంది. ఇక ఏపీ విషయానికొస్తే కేంద్ర పార్టీతో సంబంధం లేనే లేదు. స్వతహాగా ఏపీలో బీజేపీ జీరో స్టేజ్ కి వచ్చేసింది. 

ఇప్పటికే ఆ పార్టీతో పొత్తు వల్ల స్థానిక ఎన్నికల్లో నష్టపోయామనే భావన జనసేనకు వచ్చింది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఎందుకో తెగేదాకా లాగకూడదని చూస్తున్నారు. ఎన్నికలనాటికి ఓ క్లారిటీకి రావడం మాత్రం ఖాయం. ఈ దశలో చంద్రబాబు సైతం బీజేపీతో వెళ్లాలనే ఆలోచన విరమించుకుంటారని తెలుస్తోంది.

కాంగ్రెస్ తో పాటే బీజేపీ..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పడకేసింది. బీజేపీకి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నాయకుల బలం ఉంది కానీ.. ప్రజా బలం మాత్రం లేదు. ప్రత్యేక హోదా పేరుతో తీవ్రంగా వంచించిందనే కోపం, కసి ఇంకా ప్రజల్లో ఉన్నాయి. అందుకే ఏ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు ఆ పార్టీ పక్కన నిలబడలేదు. 2024నాటికి పరిస్థితి ఏమాత్రం మారదు కదా.. ఇంకా దారుణంగా తయారైనా ఆశ్చర్యంలేదు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఇప్పటికే చాలా చోట్ల జనం విసిగిపోయి వ్యతిరేక ఫలితాలొస్తున్నాయి.

దీంతో ఏపీలో కూడా బీజేపీతో కలసి నడవడానికి ఎవరూ సిద్ధంగా లేరని అర్థమవుతోంది. బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలతో అది మరోసారి రుజువైంది. లోపాయికారీగా టీడీపీ, జనసేన సపోర్ట్ చేసినా కూడా బీజేపీ పేరు చెప్పినా, కమలం పువ్వు గుర్తు కనపడ్డా తెలుగు ప్రజలు చీదరించుకుంటున్నారనేమాట వాస్తవం. మరి భవిష్యత్ ఎలా ఉంటుందో..