ఎయిడెడ్ కోసం జగన్ అంత వివరణ ఇచ్చుకోవాలా!

ఎవరి సలహానో, ఎవరి ఆలోచనో తెలియదు కానీ మొత్తానికి ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. అబ్బెబ్బే ఎయిడెడ్ స్కూల్స్ మూసేయడం లేదు, వాటి అభ్యున్నతికి పాటుపడుతున్నామంటూ సీఎం జగన్…

ఎవరి సలహానో, ఎవరి ఆలోచనో తెలియదు కానీ మొత్తానికి ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. అబ్బెబ్బే ఎయిడెడ్ స్కూల్స్ మూసేయడం లేదు, వాటి అభ్యున్నతికి పాటుపడుతున్నామంటూ సీఎం జగన్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ఎక్కడికక్కడ జిల్లాల్లో ఎయిడెడ్ స్కూల్స్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎయిడెడ్ స్కూల్స్ లో టీసీలు ఇచ్చేసి బలవంతంగా బయటకు పంపించేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఏది నిజం..? ఎంత నిజం..?

ఎయిడెడ్ స్కూల్స్ ని మూసివేయడం లేదని, ప్రభుత్వానికి అప్పగిస్తే నాడు-నేడు ద్వారా మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు సీఎం జగన్. మరి వాస్తవంలో జరుగుతున్నదేంటి..? ఎయిడెడ్ స్కూల్స్ లో ఉన్న టీచర్లని మిగతా చోట్లకు సర్దుబాటు చేస్తున్నారు, ఉన్నవారికి టీసీలు ఇచ్చి పంపించేస్తున్నారు. మరి నాడు-నేడుతో అభివృద్ధి జరిగేది ఎప్పుడు..? ఎందుకు..? ఈ గ్యాప్ లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విద్యార్థులు రోడ్డెక్కేసరికి ప్రతిపక్షాలు కూడా దీన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వంపై నిందలు వేశాయి.

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అదే సమయంలో ఆ కఠిన నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడకూడదు. పోనీ ఆ ఇబ్బంది పడేవారు ఉన్నతాదాయ వర్గాల వారైతే పర్వాలేదు. కానీ ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుకునేది ఎవరు.. ? అకస్మాత్తుగా స్కూల్స్ మూసేస్తే వారంతా ఎక్కడికి వెళ్లాలి..? దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయకుండానే నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. అందుకే రాష్ట్రంలో గందరగోళం నెలకొంది.

ఇంగ్లిష్ మీడియంలోనూ ఇంతే.. కానీ..!

గతంలో ఇంగ్లిష్ మీడియం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడతామన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్షాలు ఓవర్ యాక్షన్ చేశాయి కానీ, ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు. ప్రతిపక్షాలు కుట్రచేసి కోర్టు కేసులతో హంగామా చేసినా ఇంగ్లిష్ మీడియంపై పేద ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈసారి ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా కలసిపోయారు. స్కూళ్లు మూసేస్తున్నారనే ప్రచారం జరిగిపోయింది.

ఇకపై ఇలాంటి తప్పులు జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎయిడెడ్ స్కూల్స్ పై ఇప్పుడింత వివరణ ఇచ్చుకునే బదులు.. ఆ సమాచారమేదో ముందుగానే ఇచ్చి, ప్రజల్ని మానసికంగా సిద్దం చేసిన తర్వాతే నిర్ణయాలు అమలు చేసి ఉంటే బాగుండేది. లేకపోతే ఇలాగే అభాసుపాలు కావాల్సి వస్తుంది. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి రిస్క్ లు అవసరమా.. అని కొంతమంది అంటున్నారు.