రాజకీయ నేతలకు సుదీర్ఘ కాలం పాటు అధికారం చేతిలో ఉంటే.. ఆ తర్వాత వారి తీరే మారిపోతుందేమో! ఒకవైపు కేంద్రంలో వరసగా రెండో పర్యాయం అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ నేతల మాట తీరే సామాన్యులను బెంబేలెత్తిస్తూ ఉంటుంది. దీనికి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కూడా మినహాయింపు కాలేకపోయినట్టుగా ఉంది.
స్వయంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఏపీలో తెలంగాణ రాష్ట్ర సమితి శాఖకు డిమాండ్ వస్తోందని తమ పార్టీ ప్లీనరీలో ప్రకటించి అభాసుపాలయ్యారు. ఎవరినైతే విపరీతంగా ద్వేషిస్తూ కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించారో, మళ్లీ అక్కడ టీఆర్ఎస్ అంటూ మాట్లాడటం ప్రహాసనం. కేసీఆర్ మాటలను పట్టుకుని తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంది!
కేసీఆర్ అన్న మాటలు తెలుగుదేశం పార్టీని కూడా అవమానించేవే అని ఆ పార్టీ అర్థం చేసుకోలేకపోయింది. టీడీపీకి తోలుమందం ఆ రేంజ్ లో ఉన్నట్టుంది. తను మొదలుపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కేసీఆర్ ఆ మాటలని ఉండవచ్చు. ఆ పథకం కోసమే ఏపీలో తెరాస శాఖ అని వ్యాఖ్యానించి ఉండవచ్చు.
అయితే ఆ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఎక్కడ ప్రారంభించారో ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది! ఆ పథకం ప్రారంభించిన ఊర్లోనే.. టీఆర్ఎస్ కు మెజారిటీ రాలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. దళితుల జనాభా గణనీయంగా ఉన్న ఊళ్లోనే ఆ పథకం ప్రారంభించి ఉండవచ్చు. మరి అక్కడే టీఆర్ఎస్ కు మెజారిటీ రాలేదంటే ఆ పథకం ప్రయోజనం ఎంతో టీఆర్ఎస్ అంచనా వేసుకోవచ్చు.
ఒకసారి రాజకీయ వ్యతిరేకత ప్రారంభం అయ్యాకా.. పథకాలు, పైలెట్ ప్రాజెక్టులు పార్టీలను కాపాడలేవని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడంటున్నారు. మరి దళిత బంధు పథకం కేసీఆర్ ను ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలోనే కాపాడలేకపోయినట్టుగా ఉంది. మరి ఇంతోటి దానికి ఏపీలో శాఖ ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఇప్పుడు కేసీఆర్ బేరీజు వేసుకోవాలి.
ఇక మిగిలి ఉన్న అధికార కాలాన్ని తెలంగాణలో అధికారాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించుకుంటే అది టీఆర్ఎస్ కే మంచిది. ఏపీ కలలు ఆ తర్వాత!