సంక్షేమ పథకాల అమల్లో దేశానికి తానే రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హుజూరాబాద్ ఫలితం ఓ హెచ్చరిక అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ అధికార పార్టీ ఓడిపోగా, బద్వేల్ ఉప ఎన్నికలో మాత్రం ఏపీ అధికార పార్టీ ఘన విజయం సాధించింది. బద్వేల్ విజయం వైసీపీలో జోష్ నింపింది. ఇదే సందర్భంలో నాణేనికి రెండో వైపు హుజూరాబాద్ ఫలితాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే తనకే మంచిది.
ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘దళిత బంధు’… టీఆర్ఎస్‌ను గెలిపించలేకపోయింది. కేవలం సంక్షేమ పథకాలే తనను మరోసారి సీఎం పీఠంపై కూచోపెడతాయని వైఎస్ జగన్ నమ్ముతుంటే… ఒక్కసారి హుజూరాబాద్ ఫలితాన్ని అధ్యయనం చేయడం మంచింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 23,183 దళిత కుటుంబాల్లో 40 వేలకు పైగా ఉన్న దళిత ఓట్లన్నీ గంపగుత్తగా దక్కించుకోవాలనే ఉబలాటంలో అసలుకే ఎసరు తెచ్చుకున్నారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అప్పనంగా ఇస్తామన్నా, చివరికి అనుకున్న స్థాయిలో ఓట్లు రాలలేదనే వాస్తవాన్ని బీజేపీ గెలుపే చెబుతోంది. బద్వేల్‌లో భారీ విజయానికి అనేక కారణాలు తోడై ఉండొచ్చు. గతంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆకస్మిక మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య సుగుణమ్మ లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందిన సంగతి తెలిసిందే.
అప్పట్లో వైసీపీ పోటీకి దూరంగా ఉంది. అయితే ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీ చేతిలో టీడీపీ ఓడిపోయిన సంగతి గుర్తించుకోవాలి. నంద్యాల ఉప ఎన్నిక, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ఫలితం ఏంటో జగన్‌కంటే బాగా తెలిసిన వారుండరు. ఉప ఎన్నిక విజయమే సార్వత్రిక ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందనే భ్రమలు వీడాలనేందుకే ఈ ఉదాహరణలు.
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు విజయవంతంగా సాగుతోంది. ఇదే సందర్భంలో సంక్షేమం తప్ప, అభివృద్ధి పనులేవీ జరగలేదనేది కూడా పచ్చి నిజం. తమ కష్టార్జితాన్ని అప్పనంగా ప్రభుత్వం పప్పుబెల్లాల్లా పంచుతోందని ఒక వర్గం ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించాలి. బద్వేల్ ఉప ఎన్నిక మత్తులో ప్రభుత్వంపై వ్యతిరేకతను గుర్తించ నిరాకరిస్తే మాత్రం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.
గతంలో చంద్రబాబు కూడా ఇదే మాదిరిగా ఎన్నికల సమయంలో ముఖ్యంగా మహిళలకు తాయిలాలు ఇచ్చానని, మరోసారి విజయం వరిస్తుందని భ్రమించారు. 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే టీడీపీని పరిమితం చేయడంతో చంద్ర బాబుకు జ్ఞానోదయం అయ్యింది. అయితే అధికారం పోయిన తర్వాత లబోదిబోమంటే ప్రయోజనం ఏంటి?
కావున అన్ని వర్గాల ఆదరణ చూరగొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు చేపట్టాలి. తన పాలనలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలి. ఇంకా రెండున్నరేళ్ల పాలనా కాలం ఉంది. ఈ నేపథ్యంలో పాలనను సవ్య దిశలో నడిపించడానికి అవకాశం ఉంది.
ఉద్యోగులు, రైతులు, మధ్య తరగతి కుటుంబీకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు తదితరుల మనసులు గెలుచుకునేలా పాలనా రీతులను మలుచుకోవాలి. అదే చేస్తే జగన్‌కు తిరుగుండదు. లేదంటే గుణపాఠం నేర్వడానికి ఓ చంద్రబాబు, తాజాగా కేసీఆర్ ఓటములు కళ్లెదుటే ఉన్నాయి.