టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నికలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత మరొకటి ఎన్నికలు రావడం, ఓటములు నీడలా వెంటాడుతుండడం బాబులో అసహనానికి కారణమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో మున్సిపల్ ఎన్నికల సమరం ప్రారంభమైంది. పలు కారణాలతో గతంలో నిలిచిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి శుక్రవారం వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 350 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15న వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉంది. కుప్పంలో 25 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
గతంలో కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో టీడీపీ అధినేత, అక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంటే, ఇక ఇతర ప్రాంతాల గురించి చెప్పేదేముందనే నిట్టూర్పు మాటలు వినిపించాయి. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదా రులు, అలాగే పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోవడం చంద్రబాబుకు తల తీసేసినట్టైంది.
తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికలు రావడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇటీవల అక్కడ రెండురోజుల పాటు పర్యటించి పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేశారు. ఎలాగైనా కుప్పం మున్సిపాలిటీలో పాగా వేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అయితే వైసీపీ ఇక్కడ ఓ తప్పు చేయకపోతే మాత్రం చంద్రబాబుకు సినిమానే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ నేతల నామినేషన్లను అడ్డుకోకుండా, అన్ని వార్డుల్లో వారితో వేయించి… ఎన్నికల్లో ఓడిస్తే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుందని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. అనవసర దుందుడుకు చర్యలకు దిగి అసలు ప్రత్యర్థులతో నామినేషన్లే వేయించకుండా చేస్తే మాత్రం చంద్రబాబు కోరుకున్నదే చేసినట్టుగా భావించాల్సి వుంటుందని చెబుతున్నారు. గతంలో వైసీపీ అరాచకాలకు నిరసనగా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కుప్పం మున్సిపాలిటీలో అలాంటిది ఏ చిన్న ఘటన జరిగినా ఎన్నికల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు మరోసారి బహిష్కరణ పిలుపునిచ్చి, అధికార పార్టీపై బురద చల్లేందుకు సిద్ధంగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావున కుప్పంలో అలాంటి పొరపాట్లకు వైసీపీ పాల్పడకుండా పార్టీ, అధికార పెద్దలు తగిన చర్యలు తీసుకోవాల్సి వుంది.
క్షేత్రస్థాయిలో, అది కూడా కుప్పంలో బాబు పరపతి ఎంతో ఎన్నికల ద్వారానే లోకానాకి చాటి చెప్పాలనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.