తెలుగుదేశం బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చెయ్యలేదు. అయినా కూడా దారుణంగా ఓడిపోయింది.
ఎలా?
అసలు ఓటమికి భయపడే తెలుగుదేశం పోటీ చెయ్యాలేదని బహిరంగంగా అందరూ నమ్ముతుంటే ఆ పార్టీ మాత్రం ప్రత్యర్థి పార్టీ నుంచి దివంగత అభ్యర్థి భార్య కనుక పోటీ చేస్తే తమ వైపునుంచి కేండిడేట్ ని నిలబెట్టమని చెప్పి తప్పుకున్నారు.
విషయమేదైనా సరే క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసుకోకుండా నిర్ణయం తీసుకోరుగా.
ఒకవేళ నిజంగా ప్రభుత్వవ్యతిరేకత బలంగా ఉందని, జనం తెదేపా పక్షాన ఉన్నారని ఉప్పందితే మాత్రం ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా ఉండేదా ఆ పార్టీ?
అది పక్కన పెడితే జనసేన కూడా తెదేపా మార్గంలోనే పోటీ చెయ్యకుండా ఏదో మంగళవారం సాకు చెప్పి ముడుచుకుని కూర్చుంది.
మొత్తానికి వైకాపా, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చేసాయి.
దద్దరిల్లే మెజారిటీతో వైకాపా అభ్యర్థి నెగ్గడం జరిగిపోయింది.
వైకాపా కి పోలైన ఓట్లు 112211. ఎటు నుంచి చూసినా గెలుపు వైకాపాదే అన్నట్టుగా ఈ నెంబర్ కూడా ఎటు నుంచి చూసినా ఒకటే అయింది.
బీజేపీ అభ్యర్థికి 21,678 ఓట్లు పడ్డాయి.
ఇక్కడ ఈ అంకెని విశ్లేషించుకోవాలి.
వైకాపాకి బద్ధవిరోధులు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు తెదేపా, జనసేన ఓటర్లు. ఆ రెండు పార్టీలూ అస్త్రసన్యాసం చేసి కూర్చున్నాయి కనుక వాళ్లకి ప్రత్యామ్నాయం బీజేపీనే. కొందరికి కాంగ్రెసుకు కూడా కావొచ్చు.
ఇక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లలో బీజేపీ ఓటర్లతో పాటు తెదేపా, జనసేన ఓటర్ల ప్రమేయం కూడా ఉందన్నమాట. ఆ మూడు పార్టీల ఒటర్లు కలిస్తేనే 21,678 ఓట్లు నమోదయ్యాయని మరిచిపోకూడదు.
దీనినిబట్టి నిజంగా తెదేపా అభ్యర్థిని నిలబెట్టుంటే ఐదెంకల నెంబరు కూడా దాటేది కాదు. ఆరువేల ఓట్లు వచ్చిన కాంగ్రెసుకి కాస్త అటూ ఇటూగా ఉండేదంతే. అంటే కనీవినీ ఎరుగని భయంకరమైన ఓటమి నమోదయ్యుండేది.
స్థానిక ఎన్నికల్లోనూ, తిరుపతి ఉప ఎన్నికలోనూ వైకాపా గెలవడంతో ఆ పార్టీ సక్సెస్ ట్రాక్ రికార్డ్ అయిపోయిందని, ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత గణనీయంగా పెరిగిందని, సరిగ్గా బద్వేల్ ఎన్నికకి ముందే ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించిన జీవో కారణంగా ప్రజాగ్రహం చవిచూస్తోందని… కనుక వైకాపా పతనం మొదలయిందని, ఓట్లు చీలతాయని రకరకాల లెక్కలేసుకున్నారు ప్రత్యర్థులు.
అన్ని లెక్కల్నీ పటాపంచలు చేస్తూ బద్వేల్లో కూడా ఏకంగా 90,533 ఓట్ల మెజారిటీతో నెగ్గి ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించింది వైకాపా.
ఇక్కడ మనకి అర్థం కావాల్సిందేంటంటే సార్వత్రిక ఎన్నికలకి ఇంకా రెండేళ్ల నాలుగు నెలల సమయం ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రజావ్యతిరేకత వైకాపా ప్రభుత్వంపై లేదు.
బీజేపీ రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవడానికి సమీపంలో కూడా లేదు.
తెదేపా, జనసేన కలిసి రంగంలోకి దిగినా వైకాపా వెంట్రుకని కూడా కదిలించలేరు.
కాంగ్రెస్ అసలు ఊసులోనే లేదు.
అసలు ప్రభుత్వంపైన ప్రజావ్యతిరేకతంటే ఎలా ఉండాలి?
హుజూరాబాద్ ఫలితం చూస్తే తెలుస్తుంది.
తెరాస 500 కోట్లకు పైగా హుజూరాబాద్ ఓటర్లకి పంచిందని ఒక పుకారు.
ఎన్నికలకి ముందే మరొక 2000 కోట్ల వరకు రోడ్లు వేయించడం దగ్గర్నుంచి ఎన్నో పనులు చేయడం కనిపిస్తూనే ఉంది.
దీనికి తోడు దళితబంధు స్కీముని హుజూరాబాదునుంచే మొదలుపెట్టే ప్రకటన చేయడం అందరికీ తెలిసిందే.
ఇన్ని చేసినా ప్రజలు తెరాస అభ్యర్థిని కాదని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కే ఓటేసారు. తెరాస పరువుని మంటలో కలిపారు.
బీజేపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కూడా ఏకంగా ఇరవైవేల పైచిలుకు.
ఇది కచ్చితంగా తెరాస, బీజేపీ మధ్య 2023 సార్వత్రిక ఎన్నికల్లో భీకరపోరు ఉండబోతోందనే దానికి సంకేతం.
ఇక్కడ ఒక సూక్ష్మాన్ని గ్రహించాలి.
ప్రజలని పాలకులు ఐదేళ్లూ మహరాజుల్లా చూసుకోవాలి. వెంటపడి సేవలు చెయ్యాలి. ఐదేళ్లూ అడక్కపోయినా అన్నం పెట్టాలి. అడిగినవి చేసిపెట్టాలి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలి. అంతే కానీ సరిగ్గా ఎన్నికల ముందు బంగారు హారం మెడలో వేసినా ఆ బంగారాన్ని పుచ్చుకుని రెండవ ప్రత్యామ్నాయానికి ఓటేస్తారు ప్రజలు. హుజూరాబాదులో జరిగిందదే. 2019లో సరిగ్గా ఎన్నికలకి ముందు పసుపు కుంకుమ పేరుతో రూ 10000 పంచాక తెదేపాకి జరిగింది కూడా ఇదే.
మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే ఆంధ్ర ప్రదేశులో వైకాపా కోట ఎప్పటిలాగానే బలంగా ఉంది.
తెలంగాణాలో తెరాస కోట బీటలు వారుతోంది.
హరగోపాల్ సూరపనేని