పాపం హరీష్ రావు.. మళ్లీ బుక్కయ్యారు!

తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు హవా క్రమక్రమంగా తగ్గిపోతుందనుకుంటున్న టైమ్ లో.. కనీసం హుజూరాబాద్ ఎన్నికలతోనైనా ఆయన నిలబడతారేమోనని అనుకున్నారంతా. ఈటలకు చెక్ పెట్టేందుకు, అతడి మిత్రుడు హరీష్ రావును కేసీఆర్ కాస్త ముందుగానే…

తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు హవా క్రమక్రమంగా తగ్గిపోతుందనుకుంటున్న టైమ్ లో.. కనీసం హుజూరాబాద్ ఎన్నికలతోనైనా ఆయన నిలబడతారేమోనని అనుకున్నారంతా. ఈటలకు చెక్ పెట్టేందుకు, అతడి మిత్రుడు హరీష్ రావును కేసీఆర్ కాస్త ముందుగానే రంగంలోకి దింపారు. అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ని ప్రకటించక ముందే హరీష్ రావు, హుజూరాబాద్ లో అందరితో టచ్ లోకి వెళ్లారు. అన్నీ తానై నడిపించారు. 

గెల్లు అభ్యర్థిత్వం ఖరారయ్యాక.. ప్రచారంలో, ప్రచార సభల్లో హరీష్ రావే ముందున్నారు. సీఎం కేసీఆర్ నేరుగా ప్రచారానికి రాలేదు, అటు కేటీఆర్ కూడా పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అయ్యారు. ఈ దశలో హుజూరాబాద్ లో గ్రౌండ్ వర్క్ చేసింది హరీష్ రావే.

మొదట్లో ఈటలపై వాగ్బాణాలు సంధించడానికి హరీష్ మొహమాటపడ్డారు. తీరా పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలాయి. ఈటలను నేరుగా టార్గెట్ చేశారు హరీష్. అయితే ఒక ఉద్యమ నేతపై, పైగా తన స్నేహితుడిపై అన్యమనస్కంగానే అభాండాలు వేశామన్న బాధ హరీష్ లో కనిపించిందని అంటారు ఆయన సన్నిహితులు. కానీ మేనమామ కోసం, ఆయన పరువు కోసం హరీష్ రావుకి అది తప్పలేదు. 

ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తాను టార్గెట్ అవుతానని తెలిసి కూడా హరీష్ రావు హుజూరాబాద్ లో తిష్టవేసి కష్టపడ్డారు. హుజూరాబాద్ ఫలితాన్ని గెల్లు శ్రీనివాస్ ఓటమిగా ఎవరూ చూడటంలేదు, అక్కడ హరీష్ రావే ఓడిపోయారని అనుకుంటున్నారు.

దుబ్బాక సీన్ రిపీట్ అయిందా..

గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా హరీష్ రావు అన్నీ తానై నడిపించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య, సుజాత తరపున హరీష్ రావు నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ని ఓడించేందుకు శాయశక్తులా కృషిచేశారు. అక్కడ అనూహ్యంగా రఘునందన్ రావు గెలవడంతో హరీష్ తలకొట్టేసినట్టయింది. 

ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా గెల్లుని ముందు పెట్టి హరీష్ వెనక ఉండి కథ నడిపించారు. ఒకప్పుడు ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు, ఇప్పుడు వరుస వైఫల్యాలతో పార్టీపై పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది.

విచిత్రం ఏంటంటే.. హరీష్ రావు వేలు పెట్టని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. హరీష్ రావు అన్నీ తానై నడిపించిన రెండు చోట్ల పార్టీ ఓడిపోయింది. దీంతో మరోసారి సీఎం మేనల్లుడు అవమాన భారంతో టాక్ ఆఫ్ తెలంగాణగా నిలిచారు.