వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఉప ఎన్నికలు ఎదురుదెబ్బగా మారాయి. ఈ ఫలితాలు దేశంలో బీజేపీకి ఎదురు గాలి వీస్తోందని బలంగా చెప్పాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీలో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.
ఏపీలోని బద్వేల్ లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకపోయినా బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణలోని హుజూరాబాద్ లో ఈటల విజయాన్ని బీజేపీ ఖాతాలో వేయడం సరికాదు. అక్కడ ఈటల, కేసీఆర్ పై గెలిచారు. అంతే తప్ప, బీజేపీ టీఆర్ఎస్ పై గెలిచిందని ఎవరూ అనుకోరు.
పశ్చిమబెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నాలుగులో రెండు బీజేపీ సిట్టింగ్ స్థానాలు. అక్కడ కూడా దీదీ టీమ్ పాగా వేయడంతో బీజేపీ పరాజయం సంపూర్ణం అయిపోయింది.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఒక లోక్ సభ స్థానంతో పాటు.. మూడు అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ లాగేసుకుంది.
కర్నాటకలో సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందగా.. మరో నియోజకవర్గంలో మాత్రం బీజేపీకి విజయం దక్కింది.
అసోంలో ఉప ఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చే విషయం. మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ హవా కొనసాగింది. ఇక హర్యానాలో బీజేపీపై ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి విజయం సాధించారు. దాద్రా నగర్ హవేలి లోక్ సభ స్థానంలో శివసేన విజయం సాధించింది.
మొత్తమ్మీద ఈ ఉప ఎన్నికలు బీజేపీకి షాకింగ్ రిజల్స్ట్ ఇచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ముందు ఇలాంటి ఫలితాలు రావడం అధిష్టానాన్ని అయోమయంలో పడేసింది. రైతు చట్టాలు, ఇంధన ధరలు.. బీజేపీకి పెద్ద గుణపాఠమే చెప్పాయి.