చంద్రబాబు శారీరకంగానే కాదు మానసికంగా కూడా వృద్ధుడైపోయాడు. ఇది కంటికి కనిపిస్తున్న సత్యం. ఒకదానికొకటి మాట్లాడడం, లేని పోని కథలు చెప్పడం, గతాన్ని గొప్పగా చెప్పుకోవడం, తాను చెయ్యలేనివి చెయ్యనివి కూడా చేసినట్టు కోతలు కోయడం ఇవన్నీ మానసిక బలహీనతలు. మెదడు మందగించిందనడానికి సంకేతాలు.
మొన్నటికి మొన్న ఒక సభలో “సైకిల్ పాలన పోవాలి..సైకిల్ మనకొద్దు” అన్నాడు. మనసులో ఫ్యాన్ అని అనాలనుకున్నా తన మానసిక బలహీనత మాత్రం నోటితో సైకిల్ అని పలికించింది. తాజాగా “ఇష్టానుసారంగా నేను రిగ్గింగ్ చేసుకుందామని వస్తే రాకుండా నన్ను వెనక్కి పంపించారు” అన్నాడు. ఈ వాక్యం ఒకసారి కాదు. రెండు సార్లు వేరే వేరే సందర్భాల్లో అన్నాడు. నలభై ఏళ్ల రాజకీయానుభవం ఉన్నవాడికి “రిగ్గింగ్” అంటే అర్ధం తెలీకుండా ఉండదు. అసలు తాను ఏం చెప్పదలచుకుని ఏమంటున్నాడో తనకైనా అర్థమౌతోందా? “క్యాంపైన్” అనబోయి “రిగ్గింగ్” అన్నాడా? అలా అనుకుందామనుకున్నా రెండింటికీ ఒక్క అక్షరం కూడా కలవట్లేదు కదా!
మతి తప్పి ఒకదానికొకటి చేసేవాడిని కారు డ్రైవింగ్ సీట్లోనే కూర్చోనీయరు. అలాంటిది ఏ ధైర్యంతో ప్రజలు సీ.ఎం సీట్లో కూర్చోనిస్తారు?
ఆమధ్యన జయంతి అనబోయి వర్ధంతి అన్నాడని లోకేష్ మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అలాంటివి నిజానికి చాలానే అన్నాడతను. ఇప్పుడా తెలివితక్కువ ప్రసంగం తండ్రికి కూడా సంక్రమించినట్టుంది. ఎక్కడైనా కొడుక్కి తండ్రిపోలికలొస్తాయి. ఇక్కడ తండ్రికే కొడుకు పోలికొచ్చింది విడ్డూరంగా.
అన్ని రకాలుగా వృద్ధుడైపోయి తన బలహీనతల్ని బయట పెట్టుకుంటున్న దశలో చంద్రబాబుకి రాజకీయాలు అవసరమా? రిటైర్మెంటు ఎందుకు తీసుకోడు? ఇక్కడ వయసుకన్నా ఆరోగ్యం గురించే మన చర్చ. 90 కి దగ్గరపడుతున్నా షార్ప్ మైండ్, బాడీతో ఉంటే పర్వాలేదు. కానీ 70 ప్లస్ కే చంద్రబాబు చెల్లని నోటులా కనిపిస్తున్నాడు. ఈ వయసులో ఎవరికైనా చేతికొచ్చిన కొడుకో అల్లుడో ఉంటారు. కానీ పాపం బాబుకి ఆ అదృష్టం లేకుండా పోయింది. కొడుకు జీవితాన్ని కూడా తానే దిద్దాల్సిన పరిస్థితి. “బొమ్మరిల్లు”లో ప్రకాష్ రాజ్ మాదిరిగా కొడుకుకి ఏదైనా అప్పజెప్పినా కూడా నమ్మకం లేక అన్నీ తానే చెయ్యాలనుకుంటున్నాడు బాబు. ఇదొక దురవస్థ. అలాగని నమ్మి వదిలేయడానికి లోకేష్ నిజంగానే సమర్ధుడు కాదు.
ఇదిలా ఉంటే లేని పోని రాతలు రాసి ఎల్లో మీడియా వర్తమానాన్ని, భవిష్యత్తుని పచ్చగా చూపిస్తుంటుంది. కర్ణాటక విజయపురి సిద్ధేశ్వర సామీజీ అంతిమయాత్రకు వచ్చిన జనాన్ని కుప్పం చంద్రబాబు పర్యటనకి వచ్చిన జనంగా ప్రచారం చేసింది ఎల్లో మీడియా. ఇలా ఏ పని చేసినా వెంటనే దొరికిపోవడం తెదేపా సానుకూల మీడియా ప్రత్యేకత.
ఈ సందర్భంగా మరొక రసవత్తరమైన ఘట్టాన్ని చెప్పుకోవాలి. తాజాగా పోలీసులు కొట్టారని కొంతమంది తెదేపా కార్యకర్తలు కుప్పం ఆసుపత్రిలో చేరారు. గురువారం నాడు వాళ్లని పరామర్శించే సీన్లోకి ఎంటరయ్యాడు బాబు. బెడ్ల మీద గాయాలై పడి ఉన్న కార్యకర్తలు, వారిని పరామర్శిస్తున్న బాబుని కవర్ చేస్తూ స్టిల్స్ తీసారు. ఈ తంతు ముగిసాక బాబు వెళ్లిపోయాడు. ఆయనలా వెళ్లాడో లేదో ఈ కార్యకర్తలు మంచాలు దిగి టకటకా వెళ్లిపోయారు. కాసేపటికి చూస్తే మచ్చుకు ఒక్క పెయిడ్ ఆర్టిస్టైనా బెడ్ మీద లేడు.
ఇలాంటి చవకబారు పనులు దొరికిపోతామన్న సిగ్గుకూడా లేకుండా చేసుకుపోతున్నారు బాబు, ఎల్లో మీడియా. వాళ్ల లెక్క ఒక్కటే. తాము చెప్పే, చూపే, రాసే అబద్ధాలని 100 మందిలో కనీసం ఇద్దరు బలంగా నమ్మినా చాలు అని. కానీ వాళ్లు లెక్కేసుకోవాలసింది ఆ ఇద్దరిలో ఒక్కడైనా ఓటేస్తారా అని. ఎందుకంటే ఈ అభూతకల్పనలు, అబద్ధాలు 2014-2019 మధ్యలో కూడా రాసారు. 2019 ఎన్నికల్లో ఫలితం చూసారు. అయినా సరే…బుద్ధి మారట్లేదు.
హరగోపాల్ సూరపనేని