నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో 'వీరసింహారెడ్డి' లో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
దర్శకుడు గోపీచంద్ ఇందులో నా పాత్ర గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. బాలకృష్ణ సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. 'వీరసింహారెడ్డి' కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.
అసలు నన్నే ఎందుకు ఎంచుకున్నారు అని అడిగా. దర్శకుడు గోపిచంద్ నా వర్క్ ని చూశారు. ఈ పాత్రకు నేను అయితే సరిపోతానని ఆయనకి అనిపించింది. ఇది లక్, గుడ్ టైం. ఇందులో నా లుక్ చాలా మొరటుగా వుంటుంది. స్క్రీన్ పై చాలా మార్పు కనిపిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి.
బాలకృష్ణ తో కలసి నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్ లో చూసినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను. సినిమా చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. ఫైట్లు కూడా చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్ లో ఫీలౌతారు.
మంచి పాత్రలు వస్తే తెలుగులో విలన్ గా కంటిన్యూ కావడానికి సిద్ధమే. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని వుంటుంది. నేను దర్శకుడిని కూడా అయినా నటన, దర్శకత్వం రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుండి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా వున్నపుడు నా పని నటించడమే. నటుడిగా చేస్తున్నపుడు నా ద్రుష్టి అంతా కేవలం నటనపైనే వుంటుంది. దర్శకుడు నా నుండి ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ వుంటుంది.