ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో తిరగనివ్వకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను సైకో సీఎంగా ఆయన అభివర్ణించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడిపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను సైకో సీఎం అనడం ఎంత వరకు సరైందని ప్రశ్నించారు. దేశంలో ఎవరైనా పెద్ద సైకో ఉన్నారంటే అది చంద్రబాబే అని రోజా ఘాటు విమర్శ చేశారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో జన్మించడం తమకు అవమానకరమని ఆమె తీవ్ర వ్యాఖ్య చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ప్రభుత్వం జీవో-1 తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో వ్యవహరిస్తుండడం వల్లే ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రజల ప్రాణాలను వరుసగా తీసిన చంద్రబాబే ఉన్మాది అని రోజా అభివర్ణించారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగి వుంటే టీడీపీ, జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో తిరగలేరని ఆమె అన్నారు. కుప్పంలో చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని ఆమె అన్నారు. సీఎం జగన్ గురించి చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని రోజా హెచ్చరించారు.
జగన్‌పై ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే పళ్లు రాలగొడతామని ఘాటు హెచ్చరిక చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు సీఎం జగన్ రాజకీయ సమాధి కట్టిస్తారని హెచ్చరించారు. ఇదిలా వుండగా చంద్రబాబు, రోజా ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లావాసులే. పైగా ఇద్దరూ చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. చంద్రబాబుది చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె స్వగ్రామం. చంద్రగిరి నియోజక వర్గంలోని చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట రోజా స్వస్థలం. ప్రస్తుతం వీరి స్వస్థలాలు తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తాయి.