ఆయన ఆంధ్రా కురియన్ గా పేరు గడించారు. విశాఖ డైరీ అంటేనే దేశంలో ఫ్యామస్ గా ఉంది. దానికి గత 36 ఏళ్ళుగా ఏకచత్రాధిపత్యంగా చైర్మన్ గా వ్యవహరిస్తున్న వారు ఆడారి తులసీరావు. ఆయన 1977లో తొలిసారిగా విశాఖ డైరీని విశాఖలోని అక్కిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేశారు.
ఆనాడు 20 ఎకరాల్లో మొదలైన కర్మాగారం రోజుకు నాలుగు వేల లీటర్లను సేకరిస్తూ వచ్చింది ఈ రోజుకు తొమ్మిది లక్షల లీటర్ల పాల సేకరణ రోజుకు సాగుతోంది అంటే అదంతా ఆడారి తులసీరావు శ్రమ పరిశ్రమగానే చూడాలి.
ఇంత చేసినా ఆడారి తులసీరావు ఎపుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఎంపీ ఎమ్మెల్యే వంటి సీట్లు కోరుకుంటే వచ్చి వాలేవి. కానీ ఆయన నో అనే వచ్చారు. అయితే ఆయన రాజకీయంగా మద్దతు ఇచ్చే పార్టీలు ఎపుడూ గెలుస్తూ వచ్చాయి. విశాఖ రూరల్ జిల్లాలో ఆడారి పట్టు అలాంటిది.
ఇదిలా ఉంటే గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీకి మద్దతుగా నిలిచిన ఆడారి కుటుంబం 2019 ఎన్నికల తరువాత వైసీపీ వైపు గా వచ్చింది. ఆడారి కుమారుడు ఆనంద్ వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్నారు. రేపటి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆయనే. అదే విధంగా ఆడారి కుమారై రమాదేవి ఎలమంచిలి మునిసిపాలిటీ వైసీపీ తరఫున నెగ్గిన చైర్ పర్సన్. ఇలా ఆడారి ఫ్యామిలీ ఇపుడు వైసీపీతోనే ఉంది.
ఆడారి మృతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నేరుగా వచ్చి ఎలమంచిలిలోని అడారి నివాసం వద్ద ఆయనకు ఘన నివాళి అర్పించడం ద్వారా ఆంధ్రా కురియన్ ని మనసారా తలచుకున్నారు. ఆయన సేవలను ప్రస్తుతించారు. బడుగు బలహీన వర్గాలకు స్పూర్తిగా నిలిచిన ఆడారిని భావి తరాలు ఆదర్శంగా తీసుకుంటాయని అన్నారు.
రానున్న ఎన్నికల్లో ఆడారి కుటుంబం మద్దతు పూర్తిగా వైసీపీకే దక్కుతున్న నేపధ్యం నుంచి చూసినపుడు ఆ మహనీయుడి ఆశయాలని వైసీపీ ప్రభుత్వమే మరింతగా ముందుకు తీసుకుపోవాలని అంతా కోరుతున్నారు.