డబ్బు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడయినా సంపాదించు.
కానీ విలాసం కావాలంటే మాత్రం హైదరాబాద్ లో వాలిపో.
పెట్టుబడి పెట్టాలంటే హైదరాబాద్ ఎంచుకో
బెట్టింగ్ లు కాయాలంటే హైదరాబాద్ వచ్చేయ్
ఖర్చు చేయాలంటే హైదరాబాద్ ఎంచుకో
ఇప్పుడు ఇదీ ట్రెండ్.
అందుకే బెజవాడ, భీమవరం, రాజమండ్రి, విశాఖ, కడప, కర్నూలు ఇలా ఎక్కడి వారైనా వీకెండ్ డెస్టినేషన్ హైదరాబాద్ నే. కాస్త డబ్బు చేసిన వారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇలా ఎవరైనా సరే.
ఫార్మ్ హవుస్ లు, స్టార్ హోటళ్లు, ఊరికి దూరంగా వున్న అపార్ట్ మెంట్లు ఒకటి కాదు రెండు కాదు అడ్డాలు. ఎన్నో ఎన్నెన్నో
ఎవరి లెవెల్ టేబుల్ వారిది. ఎవరి లెవెల్ అడ్డా వారిది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, బడా నిర్మాతలు, ఆడే టేబుళ్లు వేరు.
కాంట్రాక్టర్లు, నిర్మాతలు ఆడే టేబుళ్లు వేరు.
చాలా మంది ఈ నిర్వహణ మీదే రోజుకు ఖర్చులు పోను లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆర్జిస్టున్నారని బోగట్టా. ఇలా నిర్వహించేవారిలో మహిళలు కూడా వున్నారని తెలుస్తోంది. వేసిన చోట టేబుల్ వేయకుండా ప్లేస్ లు మారుస్తూ వుండడం వీరి స్పెషాలిటీ.
ఇక ఐపిఎల్ ప్రారంభమైంది అంటే హైదరాబాద్ లో వాలిపోయేవారు వున్నారు. ఇక్కడి నుంచి బెట్టింగ్ దందాలు నడిపేవారు వున్నారు.
వీకెండ్ వచ్చిందంటే ఆంధ్ర నుంచి వచ్చేసే ఎమ్మెల్యేలు వున్నారు. మంత్రులు వున్నారు. స్టార్ హోటళ్లలో ముచ్చట్లు కొందరు. రిసార్ట్ ల్లో సేద తీరేది మరి కొందరు. డబ్బు సంపాదించడానికి ఆంధ్ర ఉపయోగపడతుందేమో కానీ విలాసం గా ఖర్చుచేయాలంటే, దానికి తగ్గ సర్కిల్ వుండాలంటే హైదరాబాద్ నే.
పెద్ద పెద్ద వాళ్లు పిల్లలు ఆంధ్రలో వుండడం లేదు. హైదరాబాద్ లో ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని వుంచుకుంటున్నారు. రావడం..పోవడం. లేదా ఇక్కడ ఏదో ఒక వ్యాపకం. అంతిమంగా ఇక్కడి విలాసాలు. పబ్ లు, రెస్టారెంట్లు ఇలా ఒకటి కాదు. రెండు కాదు.
రాత్రికి రాత్రి కోట్లకు కోట్లు ఖర్చు అయిపోగల మార్గాలు. అలాగే కోట్లకు కోట్లు సంపాదించగల సూత్రాలు అన్నింటికీ కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్. ఇది ఆలంబనగా చేసుకుని, ఇదే ఆదాయమార్గం మార్చుకునే వారు కూడా వున్నారు. వారే ఈ సుమంత్ చౌదరి లాంటి వారు కావచ్చు.
అయిదారు టేబుళ్లు రన్ చేస్తే రోజుకు ఫుడ్, నిర్వహణ ఖర్చు పోను రెండు లక్షల వరకు సంపాదించవచ్చు. ఇలాంటి సులువయిన సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది. సమస్య వస్తే, కొన్ని లక్షలు ఖర్చు చేస్తే పనయిపోతుంది అనే ధీమా. పైగా ఆడేది చాలా మంది సెలబ్రిటీలు కనుక వాళ్లే అండగా వుంటారనే ధైర్యం.
మొత్తం మీద అన్నింటా ముందుకు వెళ్తున్న హైదరాబాద్ విలాసాల విషయంలో కూడా ముందే వుంది.