రామ్ చరణ్-ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు.. సంక్రాంతి బెర్త్ కోసం పోటీపడుతున్న హీరోల జాబితా ఇది. వీళ్లలో కొందరు దాదాపు ఫిక్స్ అయ్యారు. మరికొందరు రావాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. మరొకరు ఆల్రెడీ అన్-అఫీషియల్ గా తప్పుకున్నారు.
ఇలాంటి టైమ్ లో పోటీలో నేనున్నానంటూ ముందుకొచ్చారు సీనియర్ నటుడు రాజశేఖర్. అవును.. ఈ హీరో నటిస్తున్న శేఖర్ అనే సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని అనుకుంటున్నారట.
సంక్రాంతి బరిలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లాక్ అయింది. జనవరి 7న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇక రాధేశ్యామ్ సినిమా జనవరి 14న వస్తోంది. ఈ రెండూ ఫిక్స్ అయ్యాయి. సర్కారువారి పాట దాదాపు పోస్ట్ పోన్ అవ్వగా, భీమ్లానాయక్ నుంచి మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ఇలాంటి టైమ్ లో శేఖర్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన చేయడమే సాహసం. కానీ రాజశేఖర్ మాత్రం థియేటర్లు దొరికితే సై అంటున్నాడట.
అటు నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతికే వస్తుందంటూ అన్నపూర్ణ స్టుడియోస్ నుంచి ఫీలర్లు వదులుతున్నారు. ఇప్పుడు శేఖర్ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అంటూ లీకులొస్తున్నాయి. రాజశేఖర్ కెరీర్ లో 91వ చిత్రం ఇది.
మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ సినిమాకు రీమేక్ గా వస్తోంది శేఖర్. లలిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. కుదిరితే జనవరి రెండో వారంలో, కుదరకపోతే జనవరి చివరి వారంలో సినిమాను రిలీజ్ చేస్తారట.