నిత్యానంద స్వామి అంటే అత్యాచారాలు, కిడ్నాప్ కేసులు గుర్తుకొస్తున్నాయి. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్న వివాదాస్పద స్వామి చక్కగా ఓ రోజు దేశం విడిచి మానవ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయాడు. తానే దైవాంశ సంభూతుడినని భావించే నిత్యానందస్వామి ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించున్నాడు. దానికి కైలాస దేశం అని చక్కగా నామకరణం చేశాడు. అంతటితో ఆయన ఆగాడా…అబ్బే, ఖాళీగా ఉండడం నిత్యానందుడి డిక్షనరీలోనే లేదు. ప్రపంచాన్ని అబ్బురపరిచేలా ఆయన మాయలు కొనసాగుతున్నాయి.
ముందే ప్రకటించినట్టు వినాయక చవితి రోజు తాను సృష్టించిన కైలాస దేశానికి కొత్త రిజర్వ్ బ్యాంక్, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు రూపొందించి ప్రారంభించాడు. మన దేశంలో వినాయక చవితి ప్రాధాన్యం ఏంటో తెలుసు కదా? ఎలాంటి విఘ్నాలు (ఆటంకాలు) లేకుండా ఏడాది పొడవునా అన్నీ సక్రమంగా సాగాలనే తలంపుతో మొట్ట మొదట విఘ్నేశ్వరునికి పూజా చేయడం హిందూ సంప్రదాయం. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే నిత్యానందుడు వినాయక చవితిని పురస్కరించుకుని తన దేశానికి అన్నీ మంచే జరగాలనే తలంపుతో నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు.
అయితే ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం? అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగులుతోంది. మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో తనకు తానుగా ఓ దేశాన్ని సృష్టించుకోవడం, అందుకు తగ్గట్టు చట్టాలు, ఇతరత్రా వ్యవస్థలను నిర్మించడం సామాన్యమైన విషయం కాదు.
నిత్యానంద స్వామి కొలువుదీరిన కైలాస దేశంలో నిజమా?కలా ? అన్నట్టు కొత్త వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయగలిగాడు? ఎవరైనా అక్కడికి పోయి అసలేం జరుగుతున్నదో చూసిన వాళ్లు లేరనే చెప్పారు. ఎంతసేపూ నిత్యానందస్వామి అనుచరులు విడుదల చేస్తున్న ప్రకటనలే ప్రపంచానికి దిక్కు అయ్యాయి. ఇంతటి కరోనా సమయంలోనూ నిత్యానందస్వామి ప్రత్యేక దేశం, కరెన్సీ, ప్రపంచ దేశాలతో ఒప్పందాలు, చట్టాలు అంటూ చేస్తున్న ప్రకటనలో ఏదో మాయా ప్రపంచాన్ని తలపిస్తోంది.
కొత్త రిజర్వ్‌బ్యాంక్, కరెన్సీ ప్రారంభం సందర్భంగా నిత్యానందస్వామి ఓ వీడియో విడుదల చేశాడు. తాను హిందూ సంస్కర్తను కానని, పునర్జీవిని అంటూ చెప్పుకొచ్చాడు. హిందూ మతాన్ని పాటించే వారు హక్కులు కోల్పోవడం వల్లే కైలాసదేశం స్థాపించా నని, అక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందన్నాడు. ఆ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానంద చెప్పుకొచ్చాడు.