ఈ ముగ్గురికీ తప్పనిసరిగా ‘ఖుషి’ కావాలి

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా సక్సెస్ కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉండొచ్చు. కానీ ముగ్గురికి మాత్రం ఇది కీలకం. ఈ…

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా సక్సెస్ కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉండొచ్చు. కానీ ముగ్గురికి మాత్రం ఇది కీలకం. ఈ సినిమా విజయం వాళ్లకు తప్పనిసరి. వాళ్లే హీరో, హీరోయిన్, దర్శకుడు.

ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, అతడి గత చిత్రం లైగర్, అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బయ్యర్ల కొంప ముంచింది. ఇప్పటికీ ఆ వివాదం ఇంకా అలా నలుగుతూనే ఉంది. విజయ్ దేవరకొండ బయటకొచ్చేశాడు కానీ, పూరి-చార్మి మెడకు అది అలా చుట్టుకునే ఉంది. అంతటి ఘోర పరాజయం నుంచి కోలుకోవాలంటే, కచ్చితంగా ఖుషి సినిమా హిట్టవ్వాల్సిందే.

ఇక సమంతకు కూడా ఖుషి సినిమా సక్సెస్ చాలా అవసరం. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నంగా ఫిమేల్ ఓరియంటెడ్ కథల్ని ఆమె ఎంచుకుంటోంది. ఈ క్రమంలో శాకుంతలం రూపంలో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చింది సమంత. ఆమె మార్కెట్ వాల్యూ నిలబడాలంటే ఖుషి సినిమా తప్పకుండా హిట్టవ్వాల్సిందే. లేదంటే, సమంతకు అవకాశాలు తగ్గడం ఖాయం అంటున్నారు చాలామంది.

ప్రతి దర్శకుడికి తన సినిమా కీలకమే. శివ నిర్వాణకు మాత్రం ఖుషి సినిమా మరింత కీలకం. ఎందుకంటే, అతడి గత చిత్రం టక్ జగదీష్ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. సో… హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడికి ఈ సినిమా విజయం అత్యవసరం. ఇక వరుస పరాజయాలతో కుదేలై కూర్చున్న బయ్యర్లు కూడా ఈ సినిమా సక్సెస్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.