సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాల డేట్స్ లాక్ అయ్యాయి. ఈ సంక్రాంతికి రోజుకో సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ముందుగా ఇద్దరు తమిళ హీరోలు పోటీ పడబోతున్నారు. ఆ తర్వాత ఇద్దరు బడా తెలుగు హీరోల పోటీ మొదలవుతుంది. ఇలా ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రసవత్తరంగా ఉండబోతోంది
సంక్రాంతి బరిలో ముందుగా తమిళ హీరోలు నిలిచారు. అజిత్ నటించిన తెగింపు, విజయ్ నటించిన వారసుడు సినిమాలు రెండూ 11వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు ఫుల్లుగా థియేటర్లు దొరికాయి. ఇప్పటికే జిల్లాలవారీగా పోస్టర్లు కూడా వేసేశారు.
ఇక 12వ తేదీన బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత రోజు, అంటే 13వ తేదీన చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అవుతోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే ఈ రెండు సినిమాలు బిజినెస్ పరంగా రికార్డులు నెలకొల్పాయి. అటు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ రెండు సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక 14వ తేదీన కల్యాణం కమనీయం అనే చిన్న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీతో సంక్రాంతి సినిమాల లిస్ట్ క్లోజ్ అవుతుంది.
సంక్రాంతి సినిమాల ముందు నిశ్శబ్దం
ఏటా కనిపించినట్టుగానే, ఈ ఏడాది కూడా సంక్రాంతి సినిమాల ముందు బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఈ వీకెండ్ ఓ మోస్తరు హైప్ తో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదు. ఉన్నది 5 రోజుల సమయం కావడం, మరో వీకెండ్ కు అవకాశం లేకపోవడంతో.. సినిమాలన్నీ వెనక్కి తగ్గాయి
దోస్తాన్, ప్రత్యర్థి, ఎ జర్నీ టు కాశీ, మైఖేల్ గ్యాంగ్ లాంటి చిన్న సినిమాలు కొన్ని థియేటర్లలోకి వస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చి మమ అనిపించుకోవడమే ఈ సినిమాల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక అవతార్, ధమాకా సినిమాల హవా కూడా ఈ వీకెండ్ తో ముగుస్తుంది.