ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో పెద్ద ఎత్తున వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోంది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఆ తరువాత అది అక్రమంగా తరలి ఇతర రాష్ట్రాలకు పోతోంది. అందుకే ఏపీ పోలీస్ ఏకంగా గంజాయి సాగునే టోటల్ గా లేకుండా చేయాలని అతి పెద్ద సంకల్పం పెట్టుకుంది.
ఏపీ సర్కార్ చిత్తశుద్ధిని ఈ సందర్భంగా ప్రస్థావించాలి. విశాఖలో రెండు రోజుల పాటు పర్యటించిన డీజీపీ గౌతం సవాంగ్ దక్షిణాది రాష్ట్రాలైన ఒడిషా, తమిళనాడు, తెలంగాణా, కర్నాటక, కేరళల పోలీసు అధికారులతో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఇతర ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాల సిబ్బందితో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశం ద్వారా గంజాయి కాదు, ఏ మాదక ద్రవ్యాలు కూడా దక్షిణాది రాష్ట్రాలను దాటి ముందు వెళ్లరాదు అని కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏవోబీలో పెద్ద ఎత్తున సాగు అవుతున్న గంజాయిని డ్రోన్లు ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్వంసం చేయాలని కూడా గట్టిగా నిర్ణయించారు.
గంజాయి మొక్క కాదు కదా మూలాలు కూడా ఇక పైన ఎవరూ చూడబోరు అంటూ డీజీపీ గౌతం సవాంగ్ గట్టి భరోసా ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద ఎంతగా ఫోకస్ పెట్టిందో అర్ధమవుతుంది. మొత్తానికి దశాబ్దాల నాటి పీడను, చీడను వదిలిస్తామని పోలీసు అధికారులు నడుము బిగించడం అంటే ఇక అంతా ఏజెన్సీలో అంతటా తులసీ వనాలే కనిపిస్తాయని నమ్మాల్సిందే.