స్నేహానికి వెలకట్టలేం. కానీ రాజకీయ స్నేహాలకు మాత్రం ఓ రేటు ఉంటుంది. నేతల బట్టి, పార్టీల బట్టి ఇది మారిపోతుంది. నేరుగా నగదు లావాదేవీలు జరుగుతాయని చెప్పలేం కానీ, స్నేహం పేరుతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఒకరికొకరు సీట్లు త్యాగం చేసుకోక తప్పదు. ఈ లెక్కన చూసుకుంటే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ తో స్నేహం చాలా కాస్ట్ లీ వ్యవహారంగా మారబోతోంది.
ఇప్పటికే తనని తాను చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఎవరి సపోర్ట్ లేకుండా 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని, ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాలని అనుకుంటున్నారు. అన్నీ అనుకూలిస్తే అభిమానులు అరుస్తున్నట్టు సీఎం అయిపోవాలనే ఆలోచన కూడా పవన్ కి ఉంది. ఈ క్రమంలో పవన్ ఒంటరిపోరుకి సిద్ధమైనా.. ఓట్ల చీలికతో వైసీపీకి మేలు కలుగుతుందని చెప్పి ఆయన్ని పొత్తులకి ఒప్పించేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నా.. 2024కి ఏమవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
బీజేపీతో స్నేహం కొనసాగించాలంటే..
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ బీజేపీ ముందు గట్టి డిమాండ్లే పెట్టాలనుకుంటున్నారట. ఎంపీ సీట్లపై పెద్దగా డిమాండ్లేవీ చేయబోనని, ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం జనసేనకు 100 నియోజకవర్గాలు వదిలిపెట్టేయాలనేది పవన్ డిమాండ్.
ఆ నియోజకవర్గాల ఎంపికలో కూడా తన మాటే చెల్లుబాటు కావాలంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీకి కూడా పెద్దగా ఆప్షన్లు లేవు. సొంత బలం ఎంతో ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో తేలిపోయింది కాబట్టి.. పవన్ చెప్పినట్టల్లా ఆడాల్సిందే. ఆయనకు కొంచెం తిక్క ఉంది కాబట్టి.. దాని ప్రకారం లెక్క సెట్ చేసుకోవాల్సిందే.
టీడీపీతో స్నేహం మొదలు పెట్టాలంటే..
బీజేపీని వదిలి టీడీపీతో స్నేహం మొదలు పెట్టాలంటే మాత్రం పవన్ కాస్త తగ్గే అవకాశముందని అంటున్నారు. అసెంబ్లీలో 70సీట్లు ఇస్తే టీడీపీతో పొత్తు పెట్టుకోడానికి పవన్ రెడీగా ఉన్నారట. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి బేషరతుగా మద్దతిచ్చిన పవన్ కల్యాణ్, తన త్యాగాలను గుర్తు చేసి మరీ 2024లో తాను అడిగినన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేయబోతున్నారు.
టీడీపీ 70 సీట్లకు ఓకే చెబితే.. బీజేపీతో స్నేహబంధం తెంచుకోడానికి ఏమాత్రం ఆలోచించనని తెగేసి చెబుతున్నారట పవన్.
నెంబర్ మారుతుందా..?
బీజేపీ అయితే 100 సీట్లు, టీడీపీ అయితే 70 సీట్లు.. జనసేనకు కేటాయిస్తేనే పొత్తు అనేది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఈ ఫిగర్లు మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
పవన్ లో కాన్ఫిడెన్స్ మరీ పెరిగితే మాత్రం ఆయన మరింత డిమాండ్ చేయొచ్చు. ఎన్నికల సమయానికి పవన్ మరింతగా చెట్టెక్కితే మాత్రం ఆ ఫ్రెండ్షిప్ కోసం టీడీపీ, బీజేపీ మరిన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సిందే.